Newlywed Suicide: పెళ్లయిన మూడు రోజుల్లోనే ఓ నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన నారాయణపేట జిల్లాలో సంచలనం సృష్టించింది. దీనికి కారణమంటూ కుటుంబ సభ్యులు చేసిన తీవ్ర ఆరోపణలు, పోలీసుల తీరుపై నిరసనతో మహబూబ్‌నగర్ జాతీయ రహదారిపై ఉద్రిక్తత నెలకొంది.
మూడు రోజుల్లో ముగిసిన జీవితం
నారాయణపేట జిల్లా, చంద్రవంచ గ్రామానికి చెందిన శ్రీలత (20)కు ఇటీవల రంగారెడ్డి జిల్లా, ఫరూక్‌నగర్ మండలం భీమవరానికి చెందిన వ్యక్తితో కుటుంబ సభ్యులు వివాహం జరిపించారు. వివాహం జరిగిన మూడు రోజుల తర్వాత, నవ దంపతులు దోమ మండలం, మోత్కూర్ గ్రామంలోని శ్రీలత మేనమామ ఇంటికి వెళ్లారు.
అక్కడే అనుకోని విషాదం చోటుచేసుకుంది. శ్రీలత బాత్రూంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
వేధింపులే కారణమంటూ హైవే దిగ్బంధనం
శ్రీలత మృతికి ఆమె స్వగ్రామం చంద్రవంచకు చెందిన సురేష్ అనే వ్యక్తి వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపించారు. పెళ్లికి ముందు నుంచే సురేష్ వేధించడం వల్లే శ్రీలత ఈ దారుణ నిర్ణయం తీసుకుందని వారు కన్నీరుమున్నీరయ్యారు. శ్రీలత మృతదేహంతో న్యాయం కోసం వారు నేరుగా కోస్గి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే, ఈ కేసు తమ పరిధిలోకి రాదని, దోమ మండలం పరిధిలో ఫిర్యాదు చేయాలని పోలీసులు చెప్పడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.
పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, బంధువులు తాండూర్-మహబూబ్‌నగర్ జాతీయ రహదారిపై మృతదేహంతోనే ధర్నాకు దిగారు. సురేష్‌ను వెంటనే అరెస్టు చేసి, కేసు నమోదు చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. నిరసన కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం..


