Vice President Election: ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వ సిద్ధమైంది. పార్లమెంట్ హౌస్‌లోని వసుధ ఎఫ్ 101లో పోలింగ్ నేటి ఉదయం 10 గంటలకు మొదలై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని ఎన్నిక రిటర్నింగ్ ఆఫీసర్ పీసీ మోడీ వెల్లడించారు. ఓట్ల లెక్కింపు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఇదిలా ఉండగా, ఉపరాష్ట్రపతి పదవికి జగ్‌దీప్ ధన్‌ఖడ్ జూలై 21న అనారోగ్య కారణాలతో రాజీనామా చేయడంతో ఆ పదవి ఖాళీ అయ్యింది. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీయే అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి క్యాండిడేట్‌గా తెలంగాణకు చెందిన జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి పోటీ పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇరు పక్షాలు ఈ ఎన్నికను చాలెంజ్‌గా తీసుకున్నాయి.
గెలుపు లాంఛనమే
ఎన్నిక్టోరల్ కాలేజ్ ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాష్ట్రపతి ఎన్నికలకు భిన్నంగా, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో లోక్‌సభ, రాజ్యసభలో సభ్యులు మాత్రమే ఓటు వేస్తారు. రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఈ ప్రక్రియలో భాగం కారు. అయితే, ప్రస్తుతం లోక్‌సభలో 542, రాజ్యసభలో 239 మంది సభ్యులున్నారు. ఈ 782 సభ్యుల్లో మెజార్టీ సభ్యులు ఎవరిని ఎన్నుకుంటే వారే ఉపరాష్ట్రపతి అవుతారు. కాగా లోక్‌సభ, రాజ్యసభల్లో కలిపి ఎన్డీయేకు 425 మంది సభ్యుల బలం ఉండగా, 11 మంది సభ్యులున్న వైఎస్సార్‌సీపీ మద్దతు ఇవ్వడంతో ఆ కూటమి బలం 436కు పెరిగింది. ఇక ఇండియా కూటమికి 324 సభ్యుల మద్దతు ఉంది. ఈ లెక్కన మ్యాజిక్ ఫిగర్ 391, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఎన్డీయే అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకే. అయితే, క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందని ఇండియా కూటమి నేతలు ఆశాభావంతో ఉన్నారు. అదే జరిగితే గనుక జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపు తథ్యమని చెబుతున్నారు.
బీఆర్ఎస్, బీజేడీ దూరం
ఉప రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండాలని బీఆర్‌ఎస్‌తో పాటు బిజు జనతాదళ్(బీజేడీ) పిలుపినిచ్చాయి. యూరియా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రైతులను మోసం చేసినందుకు తాము ఎన్నికలో పాల్గొనడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కాగా, ఓటింగ్‌లో తమ పార్టీ ఎంపీలు పాల్గొనరని బీజేడీ రాజ్యసభ సభ్యుడు సస్మిత్ పాత్రా ఢిల్లీలో వెల్లడించారు. ఈ అంశంపై పార్టీ ఎంపీలు, రాజకీయ వ్యవహారాల కమిటీతో చర్చించిన అనంతరం బీజేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తుది నిర్ణయం తీసుకున్నారని సస్మిత్ తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమికి సమాన దూరం పాటించాలన్న తమ పార్టీ విధానానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. తమ పూర్తి దృష్టి ఒడిశా రాష్ట్ర అభివృద్ధి, 4.5 కోట్ల మంది ప్రజల సంక్షేమంపైనే కేంద్రీకృతమై ఉంటుందని పేర్కొన్నారు. దీంతో బీఆర్‌ఎస్ నలుగురు, బీజేడీ ఏడుగురు సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం లేదు. శిరోమణి అకాలీదళ్, మిజోరమ్ పీపుల్స్ మూమెంట్ – మిజోరం లాంటి పార్టీలకు ఒక్కో సభ్యుడు మాత్రమే ఉన్నారు. విపక్షాల అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు పది మంది ఎంపీలు ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రకటించినప్పటికీ.. ఎంపీ స్వాతి మాలివాల్‌కు ఆ పార్టీతో సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఆమె ఎవరికి ఓటు వేస్తారనే దానిపై స్పష్టత లేదు. స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీ సభ్యులు ఎవరివైపు మొగ్గు చూపుతారనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఒక సభ్యుడున్న ఎంఐఎం ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మద్దతు ప్రకటించింది.
సంవిధాన్ సదన్‌లో మాక్ పోల్
ఎన్నిక ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఎన్డీఏ, ఇండియా కూటమి తమ ఎంపీలతో వేర్వేలు సమావేశాలు నిర్వహించి, పోలింగ్‌పై అవగాహన కల్పించాయి. సంవిధాన్ సదన్‌లోని సెంట్రల్ హాల్‌లో తమ ఎంపీలతో భేటీ నిర్వహించి ఈ ఎన్నికలో ఓటు వేయాల్సిన పద్ధతి, పాటించాల్సిన విధివిధానాలను సభ్యులకు ఇండియా కూటమి వివరించింది. సమావేశం అనంతరం వారికి మాక్ పోల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియా కూటమి నేతలు మాట్లాడుతూ.. మోజార్టీ మార్జిన్ తక్కువగా ఉందని, అందువల్ల తమ అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. తప్పుడు ఓటింగ్ జరిగే అవకాశం లేకుండా మాక్ డ్రిల్ నిర్వహించినట్టు చెప్పారు.
పార్టీలకు అతీతంగా ఓటు వేయాలి
పార్టీలకు అతీతంగా ఆలోచించి, ఓటు వేయాలని విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ ఇది వరకే విజ్ఞప్తి చేశారు. వంద శాతం ఈ ఎన్నికల్లో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని కోరారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్.. ప్రతి ఒక్కరూ దేశంపై మాత్రమే ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. ఆయన గెలుపుపై ధీమాతో ఉన్నారు.
ప్రస్తుతం పార్లమెంటు సభ్యుల సంఖ్య
లోక్‌సభ 542
రాజ్యసభ 239
మొత్తం సభ్యులు 782
మ్యాజిక్ ఫిగర్ 391
ఎన్డీయే బలం 436+
ఇండీ కూటమి బలం 324 +


