నేడు ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో పీఏసీ (PAC) సభ్యత్వాలకు ఓటింగ్ ప్రక్రియ జరుగుతుండగా ఈ ఎన్నికలను వైసీపీ బహిష్కరించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజాపద్దుల కమిటీ ఎన్నికలు జరుగుతుండటం దురదృష్టకరమని వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గతంలో ప్రతిపక్ష హోదా లేని పార్టీకి కూడా పీఏసీ (PAC) పదవి ఇచ్చారు.. కానీ కూటమి ప్రభుత్వం ఆ ఆనవాయితీకి విరుద్ధంగా చేస్తోందని ఆయన ఆరోపించారు. అందుకే ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు పెద్దిరెడ్డి వెల్లడించారు.
కాగా ఈరోజు అసెంబ్లీ కమిటీ హాలులో సభ జరిగే సమయంలోనే బ్యాలెట్ పద్ధతిలో పీఏసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం రెండుగంటల వరకు జరగనుంది. టీడీపీ తరపున ఏడుగురు సభ్యలు, జనసేన తరపున పులవర్తి రామాంజనేయులు, బీజేపీ తరపున విష్ణు కుమార్ రాజు నామినేషన్లు వేశారు. పీఏసీ ఛైర్మన్గా జనసేన ఎమ్మెల్యే పులవర్తి ఎన్నికయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు తగినంత బలం లేకపోయినా వైసీపీ తరపున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేయడం ఆసక్తికరంగా మారింది. ఆనవాయితీ ప్రకారం ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యుని పీఏసీ చైర్మన్ పదవికి ఎన్నుకుంటారు. కానీ సంఖ్యాబలం తక్కువ ఉండటంతో వైసీపీకి ఆ హోదా దక్కలేదు. దీంతో కూటమి సభ్యునికే చైర్మన్ పదవి ఇవ్వాలని కూటమి సభ్యులు అంతర్గతంగా ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించినట్లు తెలుస్తోంది.