రాష్ట్ర రాజకీయాలలో బనగానపల్లె నియోజకవర్గానిది ఒక ప్రత్యేక స్థానం. నిత్యం ఏదో విషయంలో ఈ ప్రాంతం పతాక శీర్షికలో చేరడం పరిపాటి. అలాంటిది ఎన్నికల సీజన్ లో ఇక్కడ జరిగే బెట్టింగ్ మార్కెట్ గురించిన లోతులు తెలిస్తే షాక్ అవ్వక తప్పదుమరి.
ఒకప్పటి ఫ్యాక్షన్ గడ్డ బనగానపల్లె నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో ఓటరు నాడి ఎలా ఉంటుందన్నది అభ్యర్థుల అంచనాలకు అందడం లేదు. గెలుపోటములను అంచనాలు వేయడం సాధ్యం కాని పరిస్థితి. గత ఎన్నికల్లో కంటే కూడా ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. మహిళలు, వృద్ధులు, యువత, ముస్లింలు భారీగా తరలివచ్చి స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ తర్వాత అభ్యర్థులు నియోజకవర్గంలో గ్రామాల వారిగా మండలాల వారిగా పోలింగ్ తీరు, ప్రజలు ఎవరికి అనుకూలంగా ఓటు వేసి ఉంటారు, మెజార్టీ ఎలా ఉండవచ్చు అనే అంశాలపై గ్రామ మండల స్థాయి నాయకులతో చర్చించారు. అయితే ఎవరికి వారే ఓటరు తీర్పు తమకే అనుకూలంగా ఉందని, తమ గెలుపు ఖాయం అనే ధీమాలో ఇరు పార్టీల అభ్యర్థులు ఉన్నారు.
పైకి ధీమా లోపల గుబులు
గెలుపుపై ధీమాగా ఉన్నప్పటికీ అభ్యర్థుల్లో మాత్రం గత అనుభవాలు గుబులు పుట్టిస్తున్నాయి. గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తే ఇది తేటతెల్లమవుతుంది. 1999 అసెంబ్లీ ఎన్నికలు మొదలుకొని నేటి వరకు అభ్యర్థుల విజయావకాశాలపై అభ్యర్థుల అంచనాలు తారుమారు అవుతూనే ఉన్నాయి. 1999లో అప్పటి పాణ్యం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యేగా గెలుపొందిన బిజ్జం పార్థసారధి రెడ్డి 2004 ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి చెందారు. ఆ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కాటసాని రాంభూపాల్ రెడ్డి మళ్ళీ విజయం సాధించారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో కొత్తగా ఏర్పడిన బనగానపల్లె నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున చల్లా రామకృష్ణారెడ్డి, టిడిపి తరఫున ఎర్రబోతుల వెంకటరెడ్డి పోటీ చేయగా ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీచేసిన కాటసాని రామిరెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో వైసిపి తరఫున పోటీ చేసిన కాటసాని రామిరెడ్డి అనూహ్యంగా ఓటమి చెందారు. మొదటిసారి ఎమ్మెల్యేగా టిడిపి తరఫున పోటీ చేసిన బీసీ జనార్దన్ రెడ్డి చల్లా రామకృష్ణారెడ్డి, ఎర్రబోతుల వెంకటరెడ్డి, బిజ్జం పార్థసారథి రెడ్డిల మద్దతుతో 17 వేల మెజారిటీతో గెలుపొందారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ జనార్దన్ రెడ్డి గెలుపు నల్లేరు పైన నడకేనని అందరూ భావించారు. జిల్లాలో ఎక్కడ ఓడినా బనగానపల్లెలో మాత్రం గెలుపు బీసీదేనని అప్పట్లో కోట్ల రూపాయలలో బెట్టింగులు కూడా జరిగాయి. అయితే రాష్ట్రమంతటా జగన్ మానియా నడవడం, నియోజకవర్గంలో కాటసాని రామిరెడ్డికి మద్దతుగా చల్లా రామకృష్ణారెడ్డి, ఎర్రబోతుల వెంకటరెడ్డి, బిజ్జం పార్థసారధి రెడ్డి నిలవడంతో ఆ ఎన్నికల్లో బీసీ జనార్దన్ రెడ్డి ఓటమి చెందక తప్పలేదు. ఆ ఎన్నికల్లో కాటసాని రామిరెడ్డి 13వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికలలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మాజీ ఎమ్మెల్యే, దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి, కొలిమిగుండ్ల సీనియర్ నాయకులు ఎర్రబోతుల వెంకటరెడ్డిల మరణం, మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారధి రెడ్డి సైలెంట్ గా మారడంతో నియోజకవర్గ రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయి అన్నది సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.
చీలిన చల్లా ఫ్యామిలీ
చల్లా రామకృష్ణారెడ్డి, ఆయన తనయుడు చల్లా భగీరథ రెడ్డి మరణం తర్వాత చల్లా కుటుంబంలో చీలికలు ఏర్పడ్డాయి. కొందరు వైసిపి తోనే ఉండగా కొందరు టిడిపికి మద్దతు ప్రకటించారు. దీంతో అవుకు మండలంలో పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఎవరూ ఒక అంచనాకు రాలేకపోతున్నారు. గత ఎన్నికల్లో వైసిపికి సుమారుగా 6000 మెజారిటీ అందించిన కొలిమిగుండ్ల మండలంలో ప్రస్తుతం జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి నాయకత్వంలో మెజారిటీపై ఒక క్లారిటీకి రాలేకపోతున్నారు. ఈ మండలంలో బిసి జనార్దన్ రెడ్డి సైతం మెజార్టీ సాధించాలనే లక్ష్యంతో ఎత్తులు వేశారు. ఇక ప్రధానంగా బనగానపల్లె మండలంలో పట్టణ మెజారిటీ ఏ పార్టీకి లభిస్తుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో పదివేల మెజారిటీ సాధించిన టిడిపి గత రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో మెజారిటీ తగ్గుతూ వచ్చింది. 2014 ఎన్నికల్లో ఏడు వేల మెజార్టీ రాగా, 2019 ఎన్నికల్లో అది 4000కు పడిపోయింది. ప్రస్తుత ఎన్నికల్లో మెజార్టీ ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభావం పడడం వల్ల మెజారిటీ తగ్గినప్పటికీ ప్రస్తుతం పట్టణంలో అత్యధిక మెజారిటీ తామే సాధిస్తామని టిడిపి వర్గాలు పేర్కొంటున్నాయి. వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి సైతం ఈసారి బనగానపల్లి పట్టణంపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు.
పట్టణంలో అధికంగా ఉన్న ముస్లిం ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. పట్టణ అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ముస్లింలకు చేసిన అభివృద్ధి, పార్టీలో, పదవుల్లో ముస్లిం మైనారిటీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన దృష్ట్యా తమకే మెజార్టీ ఉంటుందని పేర్కొంటున్నారు. మరోవైపు వైసీపీపై ప్రజలకు వ్యతిరేకత ఏర్పడిందని, గతంలో తాము చేసిన అభివృద్ధి, తమ కుటుంబం చేసిన మంచి పనులు, మేనిఫెస్టో, చంద్రబాబు పాలన నచ్చి తమకే ప్రజలు అధికారాన్ని కట్టబెడతారని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి నమ్మకంతో ఉన్నారు. అవుకు, కొలిమిగుండ్ల, బనగానపల్లె మండలాలలో మెజార్టీ పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. గెలుపు కోసం చెమటోడ్చిన అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యుల్లో పైకి గాంభీర్యం కనబడుతున్నప్పటికీ లోలోన గెలుపు అంచనాలు గుబులు పుట్టిస్తున్నాయి. విజయమే లక్ష్యంగా ఇరు పార్టీలు సామ దాన దండోపాయాలను ప్రయోగించారు. ఎవరికి వారు ఎక్కడా తగ్గకుండా డబ్బు ఖర్చు చేశారు. అయితే ప్రజలు సంక్షేమ పథకాల వైపు మొగ్గు చూపి వైసీపీకి మద్దతు పలికారా లేక ప్రభుత్వంపై వ్యతిరేకత, కూటమి మేనిఫెస్టోతో ప్రభుత్వ మార్పును కోరుకున్నారా అన్న విషయంలో ఓటరు నాడి పట్టడం అంత సులువు కాదని తెలుస్తోంది.
నియోజకవర్గంలో ఎవరు గెలిచినా మెజారిటీ పెద్దగా ఉండబోదని పరిశీలకులు భావిస్తున్నారు. మరి ఓటరు తీర్పు ఎలా ఉంటుందో, బంగినపల్లి కోటపై ఎవరి జెండా ఎగురుతుందో వేచి చూడాల్సిందే.