తెలంగాణతో కేసీఆర్ తెగతెంపులు చేసుకుని పార్టీలో పేరులో సైతం తెలంగాణను తొలగించారని నిప్పులు చెరిగారు బండి. కేసీఆర్ కుటుంబం కోసం మనమెందుకు కొట్టుకోవాలంటూ బండి నిలదీశారు. కరీంనగర్ జైలు నుంచి బెయిలుపై విడుదలైన బండి సంజయ్..కేసీఆర్ సర్కారు, అధికారులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లీకేజ్ వ్యవహారంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని ఈ విషయంపై తాను ప్రమాణం చేయటానికి సిద్ధమని, వరంగల్ సీపీ రెడీనా అంటూ సవాలు విసిరారు. త్వరలో సీఎం కూతురు, కొడుకు జైలుకు పోవటం ఖాయమని ఆయన హెచ్చరించారు. తాము యుద్ధానికి సిద్ధమంటూ ఆయన గర్జించారు. కేసీఆర్ కుటుంబానికి సింగరేణి ఏటీఎంలా మారిందని సింగరేణి ప్రైవేటీకరణపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంగా చెప్పారు. విద్యాశాఖ మంత్రిని బలిపశువు చేస్తున్నారని బండి అన్నారు.
కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, నిరుద్యోగులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు.
వరంగల్ సీపీతో సహా పలువురు అధికారులపై కంటెంప్ట్ కేసులు తప్పకుండా వేస్తామని, ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు బండి సంజయ్. పార్టీ అధ్యక్షుడినే అరెస్టు చేస్తే కార్యకర్తల పరిస్థితేంటని బీజేపీ కార్యకర్తలు బెదిరిపోరని కేవలం సిద్ధాంతం కోసం పనిచేసే వారే బీజేపీ కార్యకర్తలంటూ బండి సంజయ్ స్పష్టంచేస్తూ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమంటూ వెల్లడించటం విశేషం.