ఇంకా బీజేపీలో బిఆర్ఎస్ విలీనం ఒక్కటే మిగిలిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కవితకు బెయిల్ ముందే ఊహించామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. బీజేపీ, బిఆర్ఎస్ కుమ్మక్కుతోనే బెయిల్ సాధ్యమయిందని ఆయన ఆరోపించారు. మొన్నటి వరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ ను దెబ్బతీయాలని చూసారని, పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు అయ్యి బిజెపికి బిఆర్ఎస్ దాసోహం అయ్యిందని మహేశ్ ఆరోపించారు.
హరిశ్, కేటిఆర్ లు ఢిల్లీలో బీజేపీ నేతల చుట్టూ ఆపద మొక్కులు మొక్కారని, బీజేపీ నేతల ఇళ్ల చుట్టూ తిరిగి కాళ్ళ మీద పడి కవితకు బెయిల్ తెచ్చుకున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి.. బీజేపీ, బిఆర్ఎస్ లు కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయన్నారు. బీజేపీలో బిఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలు అవుతుందని, ఇంకా బీజేపీలో బిఆర్ఎస్ విలీనం ఒక్కటే మిగిలిందన్నారు.