CM KCR : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వల్ల తెలంగాణ రాష్ట్రం రూ.3లక్షల కోట్లు నష్టపోయిందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతోందన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం సహకరించి ఉంటే రాష్ట్ర జీఎస్‌డీపీ ఇంకా పెరిగి ఉండేదన్నారు.
కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని ఎన్ని సార్లు కేంద్రానికి మొరపెట్టుకున్నా ఫలితం శూన్యమన్నారు. రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు వాటా తేల్చలేదని, ఎప్పుడు తేలుస్తారో కూడా తెలియదని చెప్పారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే కేసీఆర్ నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అని ప్రధాని మోదీయే అన్నారు. ప్రశ్నించిన ప్రభుత్వాన్ని పడగొట్టడమే మోదీ విధానమా అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వచ్చిన నలుగురు దొంగలను పట్టుకుని జైల్లో పెట్టామన్నారు.
దేశంలో ఏం జరుగుతోందో మేధావులు, యువకులు ఆలోచించాలి. దేశ రాజధాని ఢిల్లీలో కరెంట్ కోతలు, మంచినీటి సమస్యలు ఉన్నాయి. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా కరెంట్ కోతలు ఉన్నాయి. దేశంలో ఏం జరుగుతుందో గ్రామాల్లో చర్చ పెట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇక జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిద్దామని పాలమూరు ప్రజలకు పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ ఎంపీ ఉన్నప్పుడే తెలంగాణ సాధించుకున్నామని, అదే స్పూర్తితో జాతీయ రాజకీయాల్లోకి ముందుకు వెలుదామని అన్నారు. ‘నేను మీతో ఉంటా.. మీరు నాతో ఉండండి.. మీరు హామీ ఇస్తే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాం. తెలంగాణ రాష్ట్రం వలె భారత దేశాన్ని కూడా అభివృద్ది చేసుకుందాం. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ చురుకైన పాత్ర పోషించాలని’ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు.