కొడంగల్ లో ఓడించినా మల్కాజ్ గిరి ఎంపీగా నిలబడితే కూకట్ పల్లి బిడ్డలు అండగా నిలబడి గెలిపించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కూకట్ పల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రేవంత్ ఉత్సాహంగా పాల్గొని శ్రేణుల్లో మరింత జోష్ నింపారు. అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు కోట్ల ప్రజలు కేసీఆర్ ను బంగాళాఖాతంలో కలిసి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చారన్న రేవంత్.. కేసీఆర్ కుట్ర చేసినా ఇంటి తలుపులు బద్దలు కొట్టి 2018లో కొడంగల్ లో నన్ను ఓడించారన్నారు. మల్కాజ్ గిరి ప్రజలు గెలిపించారు కాబట్టే సోనియా గాంధీ పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారని ఆయన చెప్పుకొచ్చారు.
ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.. 36 కులాలను బీసీల్లో చేర్చే బాధ్యత నాది అంటూ భరోసా ఇచ్చిన రేవంత్.. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, మోదీ, కేడీ కలిసి 1200 రూపాయలకు సిలిండర్ రేటు పెంచితే కాంగ్రెస్ ప్రభుత్వం 500 లకే ఇస్తోందన్నారు. మీ ఇంటికి తాగు నీరు ఉచితంగా ఇవ్వాలంటే, సమస్యలు తీరాలంటే సునీతా మహేందర్ రెడ్డిని గెలిపించాలని, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చిన వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందంటూ నిప్పులు చెరిగిన రేవంత్, ఉచిత ప్రయాణం ఇచ్చిన కాంగ్రెస్ కు ఓటేస్తరా.. గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీ కి ఓటేస్తరా..?అని నిలదీశారు. సునీతా మహేందర్ రెడ్డిని ఎంపీగా పంపిస్తే మీ సమస్యలను పరిష్కరిస్తామన్న ఆయన సునీతా మహేందర్ రెడ్డికి వేసే ప్రతి ఓటు రేవంత్ రెడ్డికి వేసినట్లన్నారు. బీజేపీకి పడే ఓటు గాడిద గుడ్డుకు వేసే ఓటన్నారు. ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే కూకట్ పల్లికి న్యాయం జరిగేదన్నారు. మల్కాజ్ గిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డికి లక్ష ఓట్ల మెజార్టీ ఇవ్వాలని రేవంత్ అన్నారు.