కాంగ్రెస్ పార్టీలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల పాత్రపై విమర్శలు ఏ స్థాయిలో వస్తున్నాయంటే ఇక హుజూరాబాద్ లో ఇప్పుడున్న కాంగ్రెస్ వేవ్ లో కూడా గెలవలేదంటే కాంగ్రెస్ పార్టీ మరెప్పుడూ ఇక్కడ విజయం సాధించలేదనే స్థాయిలో సాగుతోంది. రియల్ వ్యాపారుల వైఖరి కాంగ్రెస్ ఓటమికి కారణమా? ఇదే ఇప్పుడు కాంగ్రెస్ ను వేధిస్తున్న అసలు ప్రశ్న.
హుజురాబాద్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చర్చ ఇంకా కొనసాగుతోంది. ఒకవైపు BRS అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి గెలిచి సంబరాలు చేసుకుంటుండగా మరోవైపు బీజేపీ నేత ఈటల రాజేందర్ ఓటమితో ఆ పార్టీ క్యాడర్ సైలెంట్ అయింది. ఐతే.. కాంగ్రెస్ శిబిరంలో మాత్రం ఓటమికి గల కారణాలపై అన్వేషిస్తున్నారు.
✳️టాక్ వచ్చినా.. గెలవలేదు!
BRS నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ స్వర్గీయ వొడితల రాజేశ్వర్ రావు మనుమడు వొడితల ప్రణవ్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కాగా ప్రణవ్ గెలుపు బాటలో ఉన్నట్లు పెద్ద ఎత్తున టాక్ వచ్చింది. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత ప్రణవ్ మూడో స్థానానికి పరిమితం కావడం ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రణవ్ ఓటమికి కారణాలు పలువురు విశ్లేషిస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా హుజురాబాద్ లో మాత్రం గెలవలేకపోయింది. ఇప్పుడే గెలవనప్పుడు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పాగా వేయడం సాధ్యంకాదని, 1985 నుండి పాత హుజురాబాద్, కమలాపూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఏనాడూ గెలవలేదని పలువురు చెప్తున్నారు.
✳️కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి..?
ప్రణవ్ గెలుస్తున్నాడంటూ మొదటి నుండి రోడ్లపై ఒక తుపాను లాంటి టాక్ వచ్చింది. ఐతే కాంగ్రెస్ నుండి ప్రణవ్ ఉంటేనే BRS గెలుస్తుందని ఆ పార్టీ అభ్యర్థి కౌశిక్ రెడ్డి ధీమాగా ఉండడంతో పాటు ఈటల కూడా ప్రణవ్ వల్ల తన ఓట్ బ్యాంక్ చెదిరిపోతుందని భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీ గెలుపు టాక్ ను ఓట్ బ్యాంక్ గా మలుచుకోవడంలో ఘోరంగా విఫలమైంది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారంలో హడావిడి చేసినా BRS ప్రజాప్రతినిధులు, మండల, నియోజకవర్గ స్థాయి నేతలను చేర్చుకోలేకపోయింది. BRS క్యాడర్ ను కాపాడుకోవడంలో కౌశిక్ రెడ్డి కూడా కృషి చేసారు. కౌశిక్ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 60 వేల పై చిలుకు ఓట్లు తెచ్చుకోగా కాంగ్రెస్ హవాలోనూ 53 వేల ఓట్లు మాత్రమే ప్రస్తుతం ప్రణవ్ తెచ్చుకున్నారు.
✳️రియల్ వ్యాపారుల పంట పండిందా..?
హుజురాబాద్ నియోజకవర్గంలో BRS, బీజేపీలు పోల్ మేనేజ్మెంట్ పకడ్బందీగా చేసాయి. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ వెనుకబడడం కూడా ఆ పార్టీ అభ్యర్థి ఓటమికి కారణంగా పలువురు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు ఇచ్చిన డబ్బుల్ని పూర్తిస్థాయిలో పంచలేదని ప్రచారం జరుగుతోంది. ఒక పేరొందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రతి మండలానికి ఇంచార్జిలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులనే పెట్టి డబ్బు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కీలక భూమిక పోషించిన రియల్ వ్యాపారితో పాటు అతని అనుచరులు పెద్ద ఎత్తున డబ్బు మింగినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ఆ రియల్ వ్యాపారి కాంగ్రెస్ శిబిరంలో అంతా తానై వ్యవహరించడం, కార్యకర్తలను, నాయకులను ఎవరిని నమ్మకపోవడం ఓటమికి కారణంగా చెప్తున్నారు. కాగా గ్రామాలకు చేరిన డబ్బులు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల, నాయకుల జేబుల్లో ఉండిపోయాయే తప్ప ఓటర్లకు పూర్తిస్థాయిలో పంచలేదనే ప్రచారం జరుగుతోంది. వీరి పాత్రపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బు పంపకాల విషయమై, ఎవరు డబ్బులు మింగారనే విషయమై ఆ పార్టీలో పెద్ద చర్చే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నాయకులు సదరు రియల్ వ్యాపారిపై కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వీరి వైఖరి కారణంగానే ఓటమి ఎదురైందని వాదన బలంగా వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా హుజురాబాద్ లో కాంగ్రెస్ ఓటమికి పోల్ మేనేజ్మెంట్ తో పాటు పలు అంశాలు కారణమనే చర్చ జోరుగా సాగుతోంది.