BRS MLA Harish Rao Hot Comments: బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీలు తెలంగాణపై కుట్రలు పన్నుతున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు విమర్శలు:
హరీశ్‌రావు తన ప్రసంగంలో రేవంత్ రెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ఎన్నడూ ‘జై తెలంగాణ’ అనలేదని, ఎప్పుడూ ‘జై ఢిల్లీ’, ‘జై సోనియా’, ‘జై మోడీ’ అంటూ నినాదాలు చేస్తారని అన్నారు. అలాగే, కేసీఆర్ గురించి ప్రస్తావించకుండా రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేయకుండా పారిపోయిన వ్యక్తుల్లో కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. ప్రజలు తిరగబడితే జిరాక్స్ కాపీని స్పీకర్‌కు అందించిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని, ఉద్యమకారులపై తుపాకీ పెట్టి ‘రైఫిల్ రెడ్డి’గా మిగిలారని విమర్శించారు. తెలంగాణ ద్రోహుల చరిత్ర రాస్తే, ముందుగా చంద్రబాబు నాయుడు పేరు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి పేరు ఉంటాయని పేర్కొన్నారు.
‘సింహాలు చరిత్ర చెప్పనంత కాలం, వేటగాడు చెప్పిందే కథ’ అన్నట్లుగా ఉంటుందని, కాబట్టి కేసీఆర్ పోరాటం, ఉద్యమ చరిత్రను తప్పనిసరిగా చెప్పాలని హరీశ్‌రావు నొక్కి చెప్పారు. అలా చేయకపోతే తెలంగాణ అస్థిత్వంపై దెబ్బ పడుతుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ పోరాటం, ఉద్యమ చరిత్రను కనుమరుగు చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. పుస్తకాల్లో కేసీఆర్ పేరును తొలగించడం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం, బతుకమ్మను తొలగించడం, అంబేద్కర్ విగ్రహానికి ఏనాడు దండ వేయకపోవడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు.
తెలంగాణ ఉద్యమంలో యువత పాత్ర, కేసీఆర్ విజన్:
ప్రపంచంలో ఏ పోరాటమైనా యువతతోనే ప్రారంభమవుతుందని హరీశ్‌రావు అన్నారు. 1969 ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పోరాటంలో యువత పాత్ర కీలకమైందని గుర్తుచేశారు. రాజకీయాల్లో ఎంతో మంది యువతను కేసీఆర్ ప్రోత్సహించారని, నాయకత్వం యువత నుండే పుడుతుందని ఆయన చెప్పారు. కేసీఆర్ ఒక దార్శనిక నాయకుడని, ‘రాజకీయ కక్ష సాధింపులు నాకు వద్దు, తెలంగాణ ప్రగతి నాకు కావాలని’ చెప్పిన, పని చేసిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.
‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అనేది ఉద్యమ నినాదం అని, గోదావరి, కృష్ణా జలాలను బీడు భూములకు మళ్లించింది కేసీఆర్ అని హరీశ్‌రావు వివరించారు. 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కేలా రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించింది కేసీఆర్ అని గుర్తుచేశారు. ప్రస్తుతం చంద్రబాబుకు నీళ్లు, రాహుల్ గాంధీకి నిధులు వెళ్తున్నాయని ఆరోపించారు. నీటి దోపిడీపై జరుగుతున్న కుట్రలను బద్దలు కొట్టాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.


