Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Padi Kaushik Reddy: అధికార పక్షానికే దడపుట్టిస్తున్న యువ ఎమ్మెల్యే

Padi Kaushik Reddy: అధికార పక్షానికే దడపుట్టిస్తున్న యువ ఎమ్మెల్యే

నిత్యం రాజకీయ సంచలనాలకు కేరాఫ్ ఈ డైనమిక్ లీడర్

యువనేత పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా హుజురాబాద్ రాజకీయాల్లో కేంద్రబిందువుగా నిలుస్తున్నారు. గతంలో వివిధ సందర్భాల్లో తనదైన శైలితో.. సంచలనాలకు కేంద్రబిందువైన కౌశిక్ రెడ్డి, పరిశీలకుల, విశ్లేషకుల అంచనాలు తలకిందులు చేస్తూ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా స్థానిక రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ ముఖ్య భూమిక పోషిస్తున్నారు.
✳️మొదటి నుండి సంచలనమే…
యువనేత పాడి కౌశిక్ రెడ్డి క్రికెటర్గా రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుండే.. హుజురాబాద్ రాజకీయాల్లో సంచలనంగా మారారు. మొదట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 60 వేల ఓట్లకు పైగా తెచ్చుకున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ నాడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లడంతో.. కౌశిక్ బీఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ, విప్ పదవులు కౌశిక్ ను వరించాయి. తద్వారా హుజూరాబాద్ లో తన బలాన్ని, బలగాన్ని పెంచుకున్నారు. 2023 సార్వత్రిక ఎన్నికల్లో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నా ఈటల రాజేందర్ ను ఓడించి ఆయనకు చెక్ పెట్టడమే కాకుండా తానేంటో నిరూపించుకున్నారు. నిజానికి రాష్ట్రంలో బీ ఆర్ ఎస్ ప్రభుత్వం వస్తే.. కౌశిక్ హవా నడిచేది.. అయన ప్రాధాన్యం మరింత పెరిగేది.
✳️ అదే దూకుడు కొనసాగిస్తున్న యువనేత..!
హుజురాబాద్ లో ఎమ్మెల్యేగా గెలిచిన యువనేత తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తదనంతరం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ తన గళం వినిపించారు. పలుసార్లు స్పీకర్ తో పాటు మంత్రులు కౌశిక్ కూర్చోవాలంటూ చెప్పడం కనిపించింది. కాగా కొద్దిమంది కౌశిక్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడంటూ ట్రోల్స్ చేసారు. కానీ తాను బీ ఆర్ ఎస్ పార్టీలో కెసిఆర్ వెంటే ఉంటానంటూ కుండబద్దలు కొట్టారు. ఇటీవల ఆంధ్ర సిఎం జగన్ వచ్చి మాజీ ముఖ్యమంత్రి గులాబీ అధినేత కేసీఆర్ ను కలిసిన సందర్భంలో కౌశిక్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కౌశిక్ రెడ్డి పుట్టినరోజు వేడుకకు కేటీఆర్, హరీష్ రావు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. పలు కార్యక్రమాల్లో అయన పార్టీ దిగ్గజాలు కేటీఆర్, హరీష్ రావుల వెంటే కనిపిస్తున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో మంజూరైన కల్యాణలక్షి, సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్దిదారులకు ఇచ్చే ప్రయత్నం చేయగా దీన్ని కరీంనగర్ వేదికగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే ప్రశ్నించారు. అర్ధరాత్రి అధికారులు చెక్కులు పంపిణీ చేయగా కలెక్టర్, స్థానిక అధికారులను ప్రశ్నించారు. రైతులకు సాగునీరు విడుదల చేసే విషయంలోనూ తన గళాన్ని లేవనెత్తారు. ఇటీవల బీ ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ వచ్చిన సందర్భంగా జరిగిన సభలోనూ కౌశిక్ రెడ్డి ప్రసంగించి అందరిలో ఉత్సాహం నింపారు. ఇటీవల గవర్నర్ తమిళిసై సైతం కౌశిక్ పేరును ప్రస్తావించడం కూడా రాయకీయ వర్గాల్లో, మీడియాలో సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఆరు ఎన్నికల హామీలపై కూడా కౌశిక్ ప్రతి సందర్భంలో ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు నిత్యం ప్రజల్లో, మీడియాలో ఉంటూ.. పలు కార్యక్రమాలకు హాజరవుతూ కార్యకర్తల్లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేస్తున్నారు.

- Advertisement -


✳️జమ్మికుంట మున్సిపల్ అవిశ్వాసానికి చెక్…!
జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వర్ రావుపై కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కొందరు అవిశ్వాసానికి దరఖాస్తు చేసారు. హైద్రాబాద్ శివారులోని ఓ రిసార్టులో శిబిరం ఏర్పాటు చేసి బీ ఆర్ ఎస్ పార్టీ చైర్మన్ ను గద్దెదింపే ప్రయత్నం చేసారు. ఒకదశలో అసమ్మతి నేతలకు, చైర్మన్ కు మధ్య దాడి కూడా జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన కౌశిక్ వ్యవహారాన్ని చక్కదిద్దారు. బీ ఆర్ ఎస్ చైర్మన్, కార్యవర్గానికి అండగా నిలిచారు. జిల్లా కలెక్టర్ ను కలిసి కౌన్సిలర్లకు పార్టీపరంగా విప్ జారీ చేసారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కౌశిక్ రెడ్డి సమయస్ఫూర్తి, వ్యూహం, ఎత్తుగడలతో.. అవిశ్వాసం వీగిపోయి.. చైర్మన్ పదవి బీ ఆర్ ఎస్ పార్టీ చేజారకుండా కాపాడుకోగలిగారు. తద్వారా కార్యకర్తలకు, పార్టీ క్యాడర్ కు తాను ఆపదలో, ఎల్లవేళలా అండగా ఉంటాననే సందేశం కౌశిక్ రెడ్డి గట్టిగానే ఇచ్చారు.
✳️పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపే ప్రయత్నాలు…!
పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపే దిశగా యువనేత కౌశిక్ కదులుతున్నారు. కరీంనగర్ పార్లమెంట్ బీ ఆర్ ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, బీజేపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ పోటీ చేయనున్న విషయం తెలిసిందే. హుజురాబాద్ నియోజకవర్గంలో బీ ఆర్ ఎస్ మెజారిటీపై కౌశిక్ దృష్టి పెట్టారు. ఈ ఎన్నికల్లోనూ అంతే దూకుడుతో పనిచేసి తన సత్తా చాటాలని అయన భావిస్తున్నారు. నిజానికి హుజురాబాద్ నుండి బీజేపీకి ఈటల ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా ఈసారి ఈటల మల్కాజిగిరి నుండి ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. అయన అక్కడ ప్రచారం కూడా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఇక్కడ బండి సంజయ్, ఈటల వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈటల కూడా హుజురాబాద్ తో తన సంబంధాలు క్రమంగా తగ్గిస్తూ వస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ గెలుపొందినప్పటికీ హుజురాబాద్ నియోజకర్గంలో బీ ఆర్ ఎస్ పార్టీ తన ఆధిపత్యం చాటుకుంది. ఇదే అదనుగా కౌశిక్ రెడ్డి మరోసారి పార్లమెంట్ ఎన్నికల వేదికగా తన దూకుడు మరింత పెంచి బీ ఆర్ ఎస్ కు ఎక్కువ మెజారిటీ తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. ఒకవైపు బీ ఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు భరోసా ఇస్తూ.. కాపాడుకుంటూనే.. అధికార పక్షంపై విమర్శల వర్షం కురిపిస్తూ ముందుకు వెళ్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో మూడో స్థానానికే పరిమితమైంది. ఇక్కడి నుండి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన బల్మూర్ వెంకట్ కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినప్పటికీ, ఆ పార్టీ స్థానిక ఇంఛార్జిగా ఉన్న ప్రణవ్ కు ఇప్పటి వరకు అధిష్ఠానం ఏ నామినేటెడ్ పదవికి హామీ ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎన్నికలకు ముందే పార్టీలో చేరారు.. సీనియారిటీ లేదనే కారణమా…? లేక బల్మూర్ వెంకట్ కు పదవి ఇచ్చామనే భావనతో అధిష్టానం ఉందా…? అనేది కూడా చర్చనీయాంశం అవుతోంది.

✳️ అనతి కాలంలోనే తిరుగులేని నేతగా గుర్తింపు తెచ్చుకున్న కౌశిక్ రెడ్డి…
ఏది ఏమైనా యువనేత పాడి కౌశిక్ రెడ్డి ఆనతి కాలంలోనే ఎమ్మెల్సీగా, విప్ గా తదనంతరం ఎమ్మెల్యేగా హుజురాబాద్ రాజకీయాల్లో సంచలంగా మారడంతో పాటు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అంతే దూకుడుతో.. అధికార పక్షంపై విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టడంతో పాటు ప్రజల్లో ఉంటూ.. స్థానికంగా అధికార పక్ష ఎత్తుగడల్ని చిత్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ, పార్టీ శ్రేణులను కాపాడుకుంటూ వారికి అండగా తానున్నానే భరోసా ఇస్తూ.. పార్లమెంట్ ఎన్నికలు వేదికగా.. అధికార పక్ష వైఫల్యాల్ని ఎత్తి చూపుతూ బీ ఆర్ ఎస్ పార్టీకి నియోజకవర్గంలో మెజారిటీ చూపించి తన సత్తా మరోసారి చాటాలని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News