తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ని స్వీకరిస్తున్నాను అన్నారు బీజేపీ కీలక నేత, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender). నీ హామీల అమలుపై చర్చకు మోడీ ఎందుకు? ఇక్కడ మేము ఉన్నాం… ఎక్కడ చర్చకు రావాలో చెప్పు మేము సిద్దంగా ఉన్నాం అని రేవంత్ సవాల్ పై స్పందించారు. నీ ఆరు గ్యారంటీలే కాదు 420 హామీలపై కూడా చర్చిద్దాం అంటూ రేవంత్ కి ఈటల చురకలంటించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా అభివృద్ధిపై మోదీకి చర్చకు రావాలంటూ రేవంత్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం నాంపల్లి బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఈటల… రేవంత్ చేసిన సవాల్ పై తీవ్రంగా స్పందించారు.
ఈటల రాజేందర్ (Eatala Rajender) మాట్లాడుతూ…. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన సంబరాలపై ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని చెబుతున్నారన్నారు. “ముచ్చర్లలో గత ప్రభుత్వం 14 వేల ఎకరాలు భూ సేకరణ చేశారు. ఆ భూములు పోగొట్టుకున్న రైతులు కూలీలుగా మారారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఫార్మా సిటీ రద్దు చేసి.. ఆ రైతులకు భూమి తిరిగి ఇస్తామని చెప్పింది. కానీ, ఫోర్త్ సిటీ పేరుతో 14 వేల ఎకరాలకు తోడుగా మరో 16 వేలు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. రియల్ ఎస్టేట్ పేరుతో రైతుల భూములు లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొడంగల్ లో రైతులు భూమి ఇవ్వలేమని కాళ్ళు మొక్కినా బెదిరించి సేకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. స్వయంగా కలెక్టర్ నాపై దాడి జరగలేదని చెప్పారు. అయినా వారిని విచారణ పేరుతో వేధిస్తున్నారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. ఇది లగచర్ల చుట్టూ పక్కల గ్రామాలకు మాత్రమే సమస్య కాదు. ప్రతీ రైతు రేపటి రోజున మాకు సమస్య వస్తుందని భయపడుతున్నారన్నారు. మూసీ పక్కన ఉన్న భూములను లాక్కొని.. కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈటల ఆరోపించారు.
ఒక వైపు హైడ్రా కూల్చివేతలు.. మరోవైపు లగచర్లలాంటి ఘటనలు జరుగుతుండగా ఇంకోవైపు కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని ఈటల మండిపడ్డారు. “రేవంత్.. నీ స్థాయి ఎంత ? మహారాష్ట్ర వెళ్లి ప్రధానిపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నావు. ప్రజాక్షేత్రంలో ఒకలా.. ఢిల్లీ వెళ్లి మోదీని కలిసినప్పుడు మరోలా వ్యవహరిస్తున్నావు” అని రేవంత్ రెడ్డిని ఈటల రాజేందర్ విమర్శించారు.