కేసీఆర్ హ్యాట్రిక్ సీయం కావాలని కోరుతూ చేపట్టిన ఆశయ సాధన యాత్రకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తమ డివిజన్ లో అడుగు పెట్టొదంటూ, అంబేడ్కర్ నగర్ కాలనీ వాసులు వారిని అడ్డున్నారు. ఎవరి ఆశయ సాధన కోసం చేస్తున్నారంటూ ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించారు. గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ నిరసన నినాదాలు చేశారు.
బిఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ, సొంత కుంపట్లతో వేర్పాటువాద రాజకీయాలతో స్వపక్షానికే తలనొప్పిగా మారిన పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, టిబిజికేఎస్ ప్రధాకార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, సీనియర్ నాయకుడు పాతిపెల్లి ఎల్లయ్య జట్టుకట్టి ఆశయ సాధన యాత్ర శనివారం నుండి డివిజన్ల బాటకు శ్రీకారం చుట్టారు. ముందుగా నగర మేయర్ బంగి అనిల్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న 30వ డివిజన్ దగ్గరకు రాగానే ఆ కాలనీ వాసులు యాత్రను అడ్డుకున్నారు. కేసీఆర్ గెలుపు కోసమే ఈ యాత్ర అయితే, నియోజక వర్గం ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, సంబంధిత డివిజన్ కార్పొరేటర్, మేయర్ లేకుండా తమ డివిజన్ లోకి ఎలా అడుగుపెడతారని ప్రజలు నిలదీశారు. ఎమ్మెల్యే కోరుకంటి ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూ ఎన్నో సౌకర్యాలు కల్పిస్తుంటే, అంతా తయారయ్యాక అధికారంలో కొచ్చి అనుభవిద్దామని బయలుదేరారా అంటూ ఆ డివిజన్ లో ఎదురుదాడికి దిగారు.
నియోజకవర్గం అభివృద్ధి కేవలం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తోనే సాధ్యమైందన్నారు. తాము చందరన్న వెంటే ఉంటామని, చందరన్ననే మళ్ళీ గెలిపించుకుంటామని, మీ యాత్రలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. స్వార్థపూరిత ప్రయోజనాల కోసం బిఆర్ఎస్ పార్టీలో చీలికలు తీసుకువస్తే ఎంత దూరమైన వెళ్తామని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ యాత్రలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎవరూ లేరని, కూలీలు మాత్రమే పాల్గొన్నారని అన్నారు. ఇదంతా అధికార దాహంతోని, ఎమ్మెల్యే పై కుట్రతోనే చేస్తున్నారన్నారు.
ఈ నిరసనలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు డివిజన్ ప్రజలు బూడిద బానేష్, దుర్గారావు, చింతల సతీష్, రావుల శ్రీనివాస్, నవీన్, రవి, యతిరాజ్ చంద్రశేఖర్ తో పాటు మహిళలు ఉన్నారు.