రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎన్ని బ్లాక్ మెయిల్స్ చేసినా తాను భయపడనని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) తేల్చి చెప్పారు. రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను హరీష్ రావు కబ్జా చేశాడంటూ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
“నాపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణ చేశాడు. పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్లు కబ్జాలు చేసే చరిత్ర నీది.. రంగనాయక సాగర్ దగ్గర రైతుల పట్టా భూములను ధరణి ద్వారా 13 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసి కొనడం జరిగింది. ఒక గుంట కాని, ఒక ఎకరా కాని ఇరిగేషన్ భూమి కాని, ప్రభుత్వ భూమి కాని తీసుకున్నట్టు నా చరిత్రలో లేదు.. ఏ భూమిని అయితే నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నానో ఆ భూమిలోనే నేను ఉన్నాను. నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు రేవంత్ రెడ్డి… నీ సమక్షంలోనే సర్వే చేద్దాం. రేవంత్… నువ్వు ఎన్ని బ్లాక్ మెయిల్స్ చేసినా భయపడేది లేదు.. BRS పార్టీ తరపున, రైతుల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం” అని హరీష్ రావు (Harish Rao) స్పష్టం చేశారు.