హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలే తన కుటుంబమని ఇక్కడి ప్రజల కోసం, అభివృద్ధి కోసం పని చేస్తున్నానని, మీకు ఏ కష్టం వచ్చినా ఆ కష్టం నాకు వచ్చినట్లేనని, ముఖ్యమంత్రి కేసిఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న తనను ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపిస్తానని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.
కమలాపూర్ మండలం గూడూరు, కన్నూరు, శంభునిపల్లి గ్రామాలలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కౌశిక్ రెడ్డికి ఆయా గ్రామాల ప్రజలు అడుగడుగునా స్వాగతం పలుకగా ఆప్యాయంగా ప్రజలను పలుకరిస్తూ ముందుకు సాగారు. గూడూరు గ్రామంలో నూతన గ్రామపంచాయితీ కార్యాలయం, నూతన మహిళ సంఘ భవనం, పద్మశాలి సంఘ భవనాలను ప్రారంభించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో జరిగిన సభలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని రైతు బంధు, రైతు భీమా, దళిత బంధు, కళ్యాణ లక్ష్మీ, కేసిఆర్ కిట్లు, వికలాంగులకు, వృద్దులకు ఆసరా పెన్షన్లు, సబ్సీడీ రుణాలు ఇలా ఎన్నెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ దేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, అభివృద్ధి పనులు చకచక జరుగుతున్నాయని ఆయన అన్నారు. అర్హులైన బీసీలు అందరూ దరఖాస్తులు చేసుకోవాలని కళ్యాణ లక్ష్మి పథకంలా బీసీ రుణాలు అందరికీ అందజేస్తామని అన్నారు. సుమారు మూడు నెలల నుంచి తన కుటుంబానికి దూరంగా ఉంటూ ప్రజల కోసం పని చేస్తున్నానని, ఇటీవల నియోజకవర్గ వ్యాప్తంగా వినాయక మండపాలను దర్శించుకొని తన వంతు సహాయాన్ని అందించానని, గడప గడపకు తిరుగుతూ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్. రైతు భీమా చెక్కులను స్వయం అందజేస్తున్నానని తెలిపారు. ఏ అభివృద్ధి పనికైనా మీ ముందు నేనుంటానన్నారు. కమలాపూర్ మండలాన్ని మున్సిపాలిటీ చేస్తానని, గూడూర్ పోలీస్ స్టేషన్ ను నిర్మిస్తానని హామీ ఇచ్చారు.
ఎంజేపి పాఠశాలను, కళాశాలలను అద్భుతంగా నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. మరో ఐదేండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందన్నారు. సీఎం కేసిఆర్ సహకారంతో నియోజకవర్గానికి నిధులను తీసుకువచ్చి మును పెన్నడు లేని విధంగా అభివృద్ధి చేసే బాధ్యత నాదని అన్నారు. వెయ్యి కోట్ల రూపాయలతో మరో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ మాదిరిగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతాన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేసి తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని చేతులు జోడించి కోరారు. అనంతరం కన్నూరు గ్రామంలో నూతన మహిళా సంఘ భవనాన్ని ప్రారంభించారు. ద్విచక్ర వాహనంపై తిరుగుతూ అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేశారు. నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించారు. కన్నూరు గ్రామ చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి తడక రాణి శ్రీకాంత్, జెడ్పిటిసి లడే కళ్యాణి లక్ష్మణరావు, గ్రామ సర్పంచ్ లు అంకతీ సాంబయ్య, పుల్లూరి రామచంద్రరావు, సింగిల్ విండో డైరెక్టర్ | తక్కళ్ళపల్లి సత్యనారాయణరావు, ఎంపిటిసిలు పాక లక్ష్మి రవి, వీరమనేని భాస్కర్ రావు, అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.