Sunday, September 8, 2024
Homeపాలిటిక్స్Huzurabad: వాళ్లు మోసం చేస్తారు, నిన్ను కూడా మోసం చేస్తారు: పాడి కౌశిక్...

Huzurabad: వాళ్లు మోసం చేస్తారు, నిన్ను కూడా మోసం చేస్తారు: పాడి కౌశిక్ హెచ్చరిక

చేరికలతో కాంగ్రెస్ కి లాభమా? నష్టమా?

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహిస్తూ ఉండడంతో హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వొడితల ప్రణవ్ సమక్షంలో నియోజక వర్గంలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఇతర పార్టీలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. పార్టీని ఓడించాలని చూసినవారే ఇప్పుడు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపడం పట్ల ఇంత కాలం పార్టీని నమ్ముకొని అంకితభావంతో పని చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హుజురాబాద్ పట్టణంలో గురువారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల సన్నహాక సమావేశంలో కొత్తగా పార్టీలో చేరిన పలువురిని స్టేజి పైకి పిలవడంతో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్న తమను కాదని ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ఎలా ప్రాధాన్యత ఇస్తారంటూ సమావేశంలోనే నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ ను ప్రశ్నించారు.
✳️చేరికలతో ఎవరికి లాభం…
అధికారంలో ఉన్నామని, పార్టీలో చేరే వారికి సముచిత స్థానం కల్పిస్తామని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారం ఇతర పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తల పైన ప్రభావం చూపుతోంది. ఇన్నేళ్లుగా అధికార పార్టీలో ఉన్నాం.. పదవులు అనుభవించాం.. లబ్ధి పొందాం.. మరల అధికార పార్టీలోకి వెళ్లేందుకు అవకాశం వచ్చింది.. ఇక్కడ కూడా మనమే ముందు వరుసలో ఉందామని భావించిన కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముందుకొస్తున్నారు. ముఖ్యనేతల వద్ద తమతో పాటుగా తమ మద్దతుదారులకు హామీలు పొందుతున్నారు. ఇదే పార్టీని నమ్ముకొని ఇంత కాలం అంకిత భావంతో పని చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో పలు సందేహాలకు కారణమవుతోంది.

- Advertisement -


✳️పార్టీని ఓడించాలని చూసిన వారిని పార్టీలోకి ఎలా స్వాగతిస్తారు…
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదని, కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ప్రయత్నించిన నాయకులకు సహితం కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించడం పట్ల గత పదేళ్లుగా పార్టీ కోసం అహర్నిశలు పని చేసిన నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం తమను ఇబ్బంది పెట్టిన నేతలు ఇప్పుడు తమ పార్టీలోకి రావటంపై పలు చోట్ల సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వీరిని పార్టీ ఎలా సమన్వయం చేస్తుంది. వారి ప్రాధాన్యత విషయంలో అనుసరించే ఫార్ములా ఏంటి, ఎవరికి ప్రాధాన్యత దక్కుతుంది. వారికి ఎలా న్యాయం చేస్తుంది. ఇదే ఇప్పుడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన చర్చగా మారుతోంది.
✳️ పాత వారికే ప్రాధాన్యత అనే హామీ అమలయ్యేనా…
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలో చేరికలను ప్రోత్సహించి, ప్రత్యర్థి పార్టీలను దెబ్బ తీయాలని భావిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం పార్టీలో చేరే వారికి స్వాగతం పలుకుతుంది. కొత్త చేరికలు అవసరమే అయినా, పాత వారికి ఇచ్చే ప్రాధాన్యత ఏంటనేది ఇప్పుడు ప్రశ్నగా మారుతోంది. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పని చేసిన వారు తమ నియోజకవర్గాల్లో స్థానిక సంస్థగత సీట్లపైన ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గంలో ఇతర పార్టీలకు చెందిన నాయకులను, కార్యకర్తలను పార్టీలో చేర్చుకొనే క్రమంలో వారికి హామీలు ఇవ్వడం పట్ల గ్రామాలలోని నాయకులు, కార్యకర్తలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
✳️ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ప్రణవ్ కు చేసిన సూచనపై నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ…
ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ వేడుకకు హాజరైన సమయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ ఇద్దరు కలిసి ఒకే చోట భోజనం చేస్తుండగా కౌశిక్ రెడ్డి ప్రణవ్ తో హలో బ్రదర్ చేరికల పట్ల కొంత జాగ్రత్త వహించండి. నియోజకవర్గంలో బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరుతున్న వారిపట్ల మరి అప్రమత్తంగా ఉండండి. వారు గతంలో పొన్నం ప్రభాకర్ ను, ఈటల రాజేందర్ ను, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తనను కూడా మోసం చేశారని అలాంటి వారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలని బహిరంగంగానే పాడి కౌశిక్ రెడ్డి ప్రణవ్ కు సూచన చేయడం పట్ల నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ జోరుగా జరుగుతుంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన సూచనను పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతిస్తుండడం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News