Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Huzurabad Panchayats: పంచాయతీపై మంత్రి పంచాయితీ, కౌశిక్ రెడ్డి షాకింగ్ అల్టిమేటం

Huzurabad Panchayats: పంచాయతీపై మంత్రి పంచాయితీ, కౌశిక్ రెడ్డి షాకింగ్ అల్టిమేటం

అడ్డంకులు ఎన్ని ఎదురైనా ప్రారంభిస్తాం

గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యుల పదవీ కాలం ఈ నెలతో ముగియనుండడంతో గ్రామ పంచాయతీ కార్యాలయాలను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని మంత్రులను విజ్ఞప్తి చేసినా వినకుండా, ఎంతో శ్రమపడి సర్పంచులు కట్టిన గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో వాళ్ల పేర్లు లేకుండా చేసే కుట్రను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని కమలాపూర్ మండలం కన్నూరు గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గ్రామ పంచాయతీ కార్యాలయాల ప్రారంభోత్సవాలను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే అధికారులతో ఆపే ప్రయత్నం చేశారని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్థానిక సర్పంచులు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని గ్రామ కార్యాలయాలను నిర్మిస్తే కనీసం వాళ్ళ పేర్లు పెట్టుకునే అవకాశం ఇవ్వకుండా ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. కన్నూరు గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాల ప్రారంభోత్సవం కోసం జిల్లా కలెక్టర్, మంత్రికి ఫోన్లు చేసినప్పటికీ కనీసం స్పందించలేదని అన్నారు. వారి నుంచి స్పందన లేకపోవడంతోనే శుక్రవారం ప్రారంభోత్సవానికి వచ్చామని దానిని అడ్డుకునేందుకు పదుల సంఖ్యలో పోలీసులను మోహరించడం విడ్డూరంగా ఉందన్నారు.

- Advertisement -

అధికారికంగా ప్రారంభోత్సవం చేస్తే ప్రోటోకాల్ ప్రకారమే ఉంటుంది కదా అని, అప్పుడు ఎవరి గౌరవం వారికి దక్కుతుందని అన్నారు. అధికారుల అభ్యర్థన మేరకు ప్రస్తుతం ప్రారంభోత్సవ కార్యక్రమాలను వాయిదా వేసుకుంటున్నామని, ఈ నెల 23, 24 తేదీలలోపు ప్రారంభోత్సవాల తేదీలను ప్రకటించకపోతే ఎన్ని అడ్డంకులు ఎదురైన 24 తర్వాత ఈనెల 30లోపే అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలను ప్రారంభిస్తానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు చేసే పనులను యావత్ తెలంగాణ ప్రజలతో పాటు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు కూడా గమనిస్తున్నారని అన్నారు. చెక్కుల పంపిణీ విషయంలో గతంలో కలెక్టర్ రివ్యూ మీటింగ్ లో కూడా ఇన్చార్జి మంత్రిని చెక్కుల పంపిణీ చేయాల్సి ఉందని, త్వరగా నిర్ణయం తీసుకోవాలని అన్నప్పుడు మంత్రి సానుకూలంగా స్పందించినప్పటికీ జిల్లా మంత్రి ఇవ్వకుండా చేశారని, అర్ధరాత్రి దొంగల్లా జమ్మికుంట ఎమ్మార్వోతో చెక్కులు పంపిణీ చేయించారని మండిపడ్డారు. లబ్ధిదారులకు అందించిన చెక్కులకు కూడా లబ్ధిదారుల వద్ద నుంచి ఎమ్మార్వో డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయని, దానిపై ఇప్పటికే జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశామని అన్నారు. ఎమ్మార్వోపై ఫిర్యాదు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు జిల్లా కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ అధికారులు వసూలు చేసిన డబ్బుల్లో కింది స్థాయి నుంచి మంత్రి వరకు వాటాలు వేసుకున్నారేమో అనే అనుమానం వస్తుందన్నారు.

కమలాపూర్ మండలంలోని అన్ని గ్రామాలకు చివరి ఆయకట్టవరకు నీళ్లు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. 22ఏ, 22 బి నుంచి నీళ్లు వస్తుంటాయని, వెంటనే షట్టర్ ఎత్తి రైతులకు నీళ్లు అందించాలి లేని ఎడలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం ఖాయమన్నారు. దళిత బంధుని పాయిలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ ని ఎంచుకొని ఇక్కడున్న 18 వేల కుటుంబాలకు కుటుంబానికి 10 లక్షల చొప్పున దళిత బంధు అందించారని, మొదటి విడతగా ఇప్పటికే ఐదు లక్షలు ఇచ్చిన కుటుంబాలకు, రెండో విడత దళిత బంధు వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 1500 నుంచి 2000 మందికి ఇప్పటికే వారి అకౌంట్లో డబ్బులు జమ అయి ఉన్నాయని వాటిని ఫ్రీజ్ చేశారని ఫ్రీజ్ తీసివేసి లబ్ధిదారులకు అందించాలని అన్నారు. రైతుబంధు కూడా డిసెంబర్ 9 తర్వాత ఒక్క ఎకరానికి రూ,15,000 ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రైతులకు ఖాతాలో వాటిని జమ చేయాలని డిమాండ్ చేశారు. పవర్ హాలిడే పేరుతో కరెంటు కోతలు మొదలు పెట్టారని, భవిష్యత్తులో ఈ కోతలు ఎన్ని గంటలు ఉంటాయో కూడా అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు చేయాల్సిన రెండు లక్షల రుణమాఫీని జనవరిలో చేస్తామని చెప్పినట్టుగానే చేయాలని అన్నారు.

ఈ సమావేశంలో కమలాపూర్ ఎంపీపీ తడక రాణి శ్రీకాంత్, జడ్పిటిసి కళ్యాణి లక్ష్మణ్, సింగిల్ విండో చైర్మన్ సంపత్ రావు, సీనియర్ నాయకులు తిరుపతిరావు, సత్యనారాయణ రావు, మాజీ జెడ్పిటిసి నవీన్, ఇంద్రసేనారెడ్డి, కన్నూరు గ్రామ సర్పంచ్ రామారావు, ఎంపిటిసి భాస్కరరావు, యూత్ నాయకులు దుర్వేశ్, దిలీప్, శ్రావణ్ కుమార్ యాదవ్, అఖిల్, మాట్ల రాజ్ కుమార్, దినేష్, అశోక్, ప్రశాంత్, ముజ్జు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News