చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు చేయకుండా కాలయాపన చేయడం తగదని హెచ్చరించారు. ఒకవేళ రిజర్వేషన్ల అమలులో జాప్యం చేస్తే కేంద్రం తీసుకొచ్చిన బిల్లును రాజకీయ ఎత్తుగడగానే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన 12వ రోజు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిందని అన్నారు. తమ ప్రభుత్వము తీర్మానం చేసిన దాదాపు పది సంవత్సరాల తర్వాత కేంద్రం బిల్లును తీసుకొచ్చిందని చెప్పారు. మరింత కాలయాపన చేయకుండా తక్షణమే రిజర్వేషన్లు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా రిజర్వేషన్లలో సామాజిక న్యాయం కూడా ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి చేసిన ప్రతిపాదన తరహాలో ఓబీసీ మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని అన్నారు. దాంతో అన్ని వర్గాల మహిళలకు రిజర్వేషన్ల ఫలాలు అందుతాయని అభిప్రాయపడ్డారు. కవితకు శుభాకాంక్షలు వెల్లువ మహిళా బిల్లు కోసం విశేషంగా కృషి చేసిన కల్వకుంట్ల కవితకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన కవితను బుధవారం రోజున రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తో పాటు పలువురు నాయకులు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలియజేశారు. పట్టణంలోని ఆయా కాలేజీల విద్యార్థినులు కూడా కవితను కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు
Hyd: మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలి
మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలి