‘నా జీవితం ఆర్మూరు నియోజకవర్గ ప్రజలకే అంకితం’ అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. నియోజక వర్గంలోని ఆమ్దాపూర్, వల్లభాపూర్, సీ.హెచ్ కొండూర్, వెల్మల్, అయిలాపూర్, అడవి మామిడిపల్లి గ్రామాలకు చెందిన బిజెపి, కాంగ్రెస్ పార్టీల నాయకులు కార్యకర్తలు, వివిధ కుల సంఘాల సభ్యులు, పెర్కిట్ పట్టణానికి చెందిన వీడీసీ సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై తామంతా బీఆర్ ఎస్ లో చేరుతున్నట్లు వారు తెలిపారు. ఆర్మూరులో జరిగిన కార్యక్రమంలో వారిని జీవన్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి టీఆర్ ఎస్ లోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని, కడుపులో పెట్టుకొని చూసుకుంటామని జీవన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ రథసారధి అని, ప్రజలే ఈ ప్రభుత్వానికి వారధి అని పేర్కొన్నారు.
“మీ కడుపులో తల పెట్టి అడుగుతున్న మీ బిడ్డను మళ్లీ దీవించండి. మొదటిసారి 15వేల ఓట్లతో, రెండోసారి 30వేల ఓట్లతో గెలిపించారు. మూడోసారి 60వేలకు పైగా ఓట్లతో నన్ను గెలిపించండి.
జీవితాంతం మీకు జీతగాడిలా పని చేస్తా. హ్యాట్రిక్ విజయంతో సరికొత్త చరిత్ర సృష్టిస్తా.
వన్నె తెస్తున్న 450 పథకాలు
సకల వర్గాలపై కేసీఆర్ చల్లని చూపు ఉంది. కేసీఆర్ డబ్బు పంపని ఇల్లుందా?. అభివృద్ధి చేయని ఊరుందా?. ప్రపంచ స్యాయిలోనే తెలంగాణకు వన్నె తెస్తున్న 450 పథకాలు నిజంగా కీర్తికిరీటాలు. మన రాష్ట్రం మనకు రాకుంటే ఇంత అభివృద్ధి చూసేటోళ్లమా?. తెలంగాణ వస్తే ఏమొస్తదన్న సన్నాసులకు కేసీఆర్ అధ్బుతమైన పాలనే ధీటైన సమాధానం. కాంగ్రెస్, బీజేపీలకు మళ్లీ శృంగ భంగం తప్పదు. సబ్బండ వర్గాల నడక కారు, సారు, కేసీఆర్ వైపే. ఆయన హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చరిత్ర తిరగరాయడం తథ్యం” అని జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ గారి లాంటి విజనరీ సీఎంను గతంలో ఎప్పుడైనా చూసారా అని ప్రశ్నించారు. మళ్లీ మళ్లీ బీఆర్ ఎస్ దే గెలుపు. ఎన్ని డ్రామాలాడినా కాంగ్రెస్, బీజేపీలు కాలం చెల్లిన పార్టీలేనన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో “తెలంగాణ గడ్డ అభివృద్ధికి అడ్డాగా మారింది. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ శక్తి వంచన లేకుండా పని చేస్తున్నారు. స్ఫూర్తి దాయకమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ ను దేశంలోకెల్లా అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దు తున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు వంటి అనేక వర్గాలకు చెందిన వారికి రూ.2,016, వికలాంగులకు రూ.4,016ల చొప్పున ఆసరా పెన్షన్లు ఇస్తున్నారు.
పేదింటి ఆడపిల్లల పెండ్లిండ్లు వారి తల్లిదండ్రులకు భారం కాకూడదని కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలు పెట్టి రూ.1,00,116ల చొప్పున ఇస్తూ ఇప్పటికే పది లక్షల మందికి పైగా ఆడపిల్లల పెండ్లిండ్లు జరిపిచ్చిన చరిత్ర కేసీఆర్ ది. రైతుబంధు పథకం ద్వారా ఏడాదికి ఎకరానికి రూ.10,000ల చొప్పున పెట్టుబడి సాయం చేస్తూ ఇప్పటికే రూ.80వేల కోట్ల రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఏ కారణం చేతనైనా రైతులు మరణించిన సమయంలో వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు రైతు బీమా ద్వారా రూ.5 లక్షల చొప్పున 72 గంటల లోపు బీమా సొమ్ము చెల్లిస్తున్నారు.
నియోజకవర్గంలో 460కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీళ్ళ సరఫరా జరుగుతోంది. వ్యవసాయానికి ఇరవై నాలుగంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఇలాంటివి ఇంకా ఎన్నో పథకాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్ పేద ప్రజల పక్షపాతిగా చరిత్రకెక్కారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. “ఆర్మూరు నియోజకవర్గం అభివృద్ధి వనం. ఆర్మూర్ గతంలో ఎట్లుంది?..ఇప్పుడెట్లుంది?. ఆర్మూర్, ఆలూరు, ఆర్టీసీ బైపాస్ రోడ్లు వేయించా. అంబేద్కర్ చౌరస్తా రూపురేఖలు మార్చా. పంచగూడ వంతెన కట్టించా. కులవృత్తుల పునరుత్తేజానికి అనేక పథకాలు అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన కురుమ సామాజిక వర్గానికి గొర్రెల యూనిట్లు ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు ప్రసాదించాం. ఆర్మూర్ కు వందపడకల ఆసుపత్రి సాధించా. ఈ దవాఖానలో ఇప్పటికే 23672కు పైగా ఉచిత ప్రసవాలు జరిగాయి. కేసీఆర్ కిట్ ద్వారా తల్లికి చీరె, పుట్టిన బిడ్డకు బట్టలు,పిల్లల కోసం జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఆరోగ్య సామాగ్రి, ఆట వస్తువులు, దోమల తెర వంటివి శిశు రక్షణకు అందిస్తున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న 25వేల మందికి పైగా సీఎం ఆర్ ఎఫ్, ఎల్ వో సీ ల ద్వారా ఆర్థిక సాయం చేశాం” .కిడ్నీ బాధితుల కష్టాలు తొలగించడానికి ఆర్మూర్ కు డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయించా. అన్ని సామాజిక వర్గాలకు కులసంఘ భవనాలు, ఫంక్షన్ హాళ్లు నిర్మించా అని జీవన్ రెడ్డి చెప్పారు.
ప్రజల ఆశీస్సులతో మూడోసారి గెలిచి అభివృద్ధిలో ఆర్మూర్ నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా నిలుపుతానని జీవన్ రెడ్డి విస్పష్టంగా చెప్పారు