Thursday, February 20, 2025
Homeపాలిటిక్స్Kavitha: వాళ్లది ఏకులమతమైతే మాకేంది? కవిత తీవ్ర ఆగ్రహం

Kavitha: వాళ్లది ఏకులమతమైతే మాకేంది? కవిత తీవ్ర ఆగ్రహం

రెండు పార్టీలవీ కుట్రలే

ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీవి ఏ కులం, ఏ మతం అంటూ రెండు పార్టీల నాయకులు పరస్పర రాజకీయ విమర్శలు చేసుకోవడం తప్ప బీసీల గురించి కనీసం ఆలోచించడం లేదని బీఆర్ఎస్ నేత కవిత మండిపడ్డారు. బీసీ కులగణన, రిజర్వేషన్ల పెంపు అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నాయని, ఆ రెండు జాతీయ పార్టీలు కలిసి రాజకీయ నాటకానికి తెరతీశాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

బీఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లోని నందినగర్ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. అనంతరం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామస్థులు చేపట్టిన యాగంలో పాల్గొన్నారు. ఎర్రవెల్లిలో విలేకరులతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ లకు ఎమ్మెల్సీ కవిత గట్టి కౌంటర్ ఇచ్చారు. బీసీ అంశాన్ని దృష్టి మరల్చడానికి కాంగ్రెస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. కుల సర్వేలో బీసీల తప్పుడు లెక్కల చర్చను పక్కదోవపట్టించడానికి మోదీ బీసీనా కాదా అన్న చర్చకు సీఎం రేవంత్ రెడ్డి తెరలేపారని, దాంతో రాహుల్ గాంధీది ఏ మతమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారని గుర్తు చేశారు. వీళ్లు వాళ్లను, వాళ్లు వీళ్లను తిడుతూ వాళ్లిద్దరు ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు. మోదీ బీసీ అయితేంది కాకపోతేంది ? రాహుల్ గాంధీ ఏ మతమైతే మాకేందీ ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల జనాభాను సరిగ్గా లెక్కబెట్టాలన్నదే తమ డిమాండ్ అని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ అసెంబ్లీలో బిల్లు పెట్టాలి… బీజేపీ కేంద్రంలో దాన్ని ఆమోదించాలని, ఇవి చేయకుండా మోదీ, రాహుల్ కులమతాల గురించి ప్రజలకు ఎందుకు ? అని నిలదీశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రజలను అవమానిస్తున్నాయని, తెలంగాణ చాలా రాజకీయ కుట్రలు చూసిందని, ఆ రెండు పార్టీల కుట్రలు ఇక్కడ నడవవని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి వంకర టింకర మాటలు మాట్లాడి ప్రజలను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు ఏ ఒక్క అంశానికి, సమస్యకు ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి పరిష్కారం చూపలేదని,14 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు నరకం చూపించిందని విమర్శించారు.

కాగా, తన ప్రాణాన్ని పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ ను తలవని గుండెలేదని, ప్రతీ ఒక్కరు కేసీఆర్ జన్మదినం సందర్భంగా పూజలు చేస్తున్నారని తెలిపారు. ప్రజల హక్కుల కోసం పోరాటం చేశారు కాబట్టే కేసీఆర్ ను ప్రజలు ఆరాధిస్తున్నారని చెప్పారు. అందరి ఆశీర్వాదంతో మరింత శక్తియుక్తులతో కేసీఆర్ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తారని తేల్చిచెప్పారు.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News