Thursday, July 4, 2024
Homeపాలిటిక్స్Kavitha: ఇటలీ రాణి సోనియాగాంధీ బలిదేవత

Kavitha: ఇటలీ రాణి సోనియాగాంధీ బలిదేవత

గాంధీ బబ్బర్ కాదు..పేపర్ టైగర్

ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ 2009లో దీక్ష చేస్తే ఇచ్చినటువంటి తెలంగాణను వెనక్కి తీసుకొని వందలాది బిడ్డల ప్రాణాలను తీసుకున్న ఇటలీ రాణి సోనియాగాంధీ బలిదేవత అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు.

- Advertisement -

మెట్ పల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడుతూ…

నెహ్రూ కాలం నుంచి వాళ్ల కుటుంబానికి తెలంగాణతో అనుబంధం ఉందని రాహుల్ గాంధీ చెబుతున్నారని, తెలంగాణతో రాహుల్ గాంధీ కుటుంబానికి నమ్మకద్రోహపు అనుబంధం ఉన్నదని మండిపడ్డారు. 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం 369 మందిని తుపాకులతో కాల్చి చంపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న అంజయ్య ను రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ అవమానించారని చెప్పారు. సీఎం కేసీఆర్ గారు చావు నోట్లో తల పెడితే 2009లో తెలంగాణ ఏర్పాటును ప్రకటించి మళ్లీ వెనక్కి తీసుకుంటే వందలాది మంది బిడ్డల చావులకు సోనియాగాంధీ కారణమయ్యారని అన్నారు. ప్రజా పోరాటాలతోనే 2014లో తెలంగాణ వచ్చిందని స్పష్టం చేశారు. ఆ తర్వాత కూడా తెలంగాణ కోసం పార్లమెంటులో సహకారంగా ఒక్క మాట కూడా రాహుల్ గాంధీ మాట్లాడలేదని అన్నారు. “ఆయన రాహుల్ గాంధీ కాదు… ఎలక్షన్ గాంధీ. ఎన్నికలు రాగానే అనుబంధము, కుటుంబము, మన్నుమశానం అని చెబుతున్నారు. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రలో కలిపినప్పుడు, హైకోర్టు కావాలని మేము పార్లమెంట్లో పోరాటం చేసినాడు, విభజన హామీల్లో ఒక్క హామీని కూడా బిజెపి ప్రభుత్వం నెరవేర్చకపోతే, కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించకపోతే, రాహుల్ గాంధీ ఎక్కడున్నారు? ఎందుకు మాట్లాడలేదు ? మాట్లాడే మనసు ఎందుకు రాలేదు ?” అని ప్రశ్నల వర్షం కురిపించారు. పార్లమెంటులో సోనియా గాంధీ ఆంధ్రకు రావలసిన హక్కుల గురించి మాట్లాడారు కానీ తెలంగాణ హక్కులపై మాత్రం మాట్లాడలేదని ఎండగట్టారు. పార్లమెంటులో తెలంగాణను నరేంద్ర మోడీ అవమానం చేసినప్పుడు రాహుల్ గాంధీ సోనియాగాంధీ సభలోనే ఉన్నా కూడా అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు. ఇటువంటి రాహుల్ గాంధీ మనకు కావాలా లేదా కెసిఆర్ కావాలా అన్నది ప్రజలు ఆలోచించాలని ప్రశ్నించారు. “తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ ఆనాడు దీక్ష చేశారు. ఆంధ్ర సొమ్ములతో ఉద్యమసమయంలో జరిగిన ఎన్నికల్లో మద్యం, డబ్బులను అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విచ్చలవిడిగా పంపిణీ చేయించారు. ఇదే కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తే కెసిఆర్ ని ప్రజలు కడుపులో పెట్టుకొని కాపాడుకున్న విషయం వాస్తవం కాదా ? 2009లో 11 రోజులు చావు నోట్లో తలపెట్టి సీఎం కేసీఆర్ సాధించుకొచ్చిన తెలంగాణని వెనక్కి తీసుకున్నటువంటి బలిదేవత ఇటలీ రాణి సోనియాగాంధీ” అని ధ్వజమెత్తారు. “బతుకమ్మ మీద గౌరమ్మ బదులు ఇంకేదో పెట్టుకుని పండగ చేసుకుంటామని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన వయస్సు ఏంది ? ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంది? ఆయన స్థాయి, గౌరవం ఏంది ? ఒక్క ఎన్నిక గెలవడానికి ఇంత దిగజారి మాట్లాడతారా ? ఇంత అవమానం చేస్తారా ? ఉద్యమ సమయంలో నిర్బంధం ఉన్న కాలంలో ఆడబిడ్డలు సగర్వంగా ఆత్మగౌరవానికి ప్రతీక అని నెత్తిమీద పెట్టుకుని మోసినటువంటి బతుకమ్మను అవమానించిన జీవన్ రెడ్డిని పక్కన పెట్టుకొని రాహుల్ గాంధీ జగిత్యాలలో ముచ్చట్లు చెప్పారు.” అని నిప్పులు చెరిగారు. దొరలు, ప్రజలు అంటూ రాహుల్ గాంధీ ఏమో మాట్లాడారని, అయితే మంథనిలో దొర అయిన శ్రీధర్ బాబును పక్కన పెట్టుకొని రాహుల్ గాంధీ అలా మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. డిసిసి అధ్యక్షుడు దళిత బిడ్డ కవ్వంపల్లి సత్యనారాయణకు మాట్లాడే అవకాశం ఉండదు కానీ శ్రీధర్ బాబు మాత్రం మాట్లాడారని, రాహుల్ ప్రసంగాన్ని తర్జుమా చేయడానికి దళిత బిడ్డ అడ్డలూరి లక్ష్మణ్ ను కాకుండా జీవన్ రెడ్డికి ఎలా అవకాశం ఇచ్చారు? అని ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ దొరల తెలంగాణ ప్రజల తెలంగాణ అని మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని స్పష్టం చేశారు. స్క్రిప్టు రైటర్ ని మార్చుకోవాలని రాహుల్ గాంధీకి సూచించారు.

తెలంగాణలోని సబ్బండ వర్గాల కోసం పనిచేస్తూ అందరి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ గారు ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉందని, ముఖ్యంగా బీడీ కార్మికులకు ఎంతో లబ్ధి చేకూరేలా పథకం రూపకల్పన చేశారని చెప్పారు. నాలుగున్నర లక్షల బీడీ కార్మికులకు ప్రభుత్వం పెన్షన్ ఇస్తోందని, కట్ ఆఫ్ డేట్ విషయంలో తమకు వచ్చిన విన్నతులను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళమని, దాంతో బీడీ కార్మికులకే కాకుండా సాధారణ మహిళలకు కూడా కట్ ఆఫ్ డేట్ త్ సంబంధం లేకుండా అర్హులైన మహిళలకు నెలకు 3000 రూపాయల పెన్షన్ సీఎం కేసీఆర్ ఎన్నికల తర్వాత నుంచి ఇవ్వబోతున్నారని గుర్తు చేశారు. మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పెన్షన్ పథకం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.

కెసిఆర్ బీమా పథకం చాలా అద్భుతమైనదని, కెసిఆర్ బీమా – ప్రతి ఇంటికి ధీమా అని చెప్పారు. రైతు బీమా తరహాలో రాష్ట్రంలోని పేదల కోసం రూ. 5 లక్షల మేర బీమా వర్తించేలా సీఎం కేసీఆర్ పథకాన్ని రూపొందించారని వివరించారు. ప్రతి గ్రామంలో చెరువులు కుంటలు కళకళలాడుతుండడం, నీళ్లు , కరెంటు వంటివి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడంతో పాటు అందు కింద పెట్టుబడి సాయం కూడా చేస్తుండడం ఇవాళ తెలంగాణలో వ్యవసాయం లాభసాటిగా మారిందని స్పష్టం చేశారు. దానివల్ల గల్ఫ్ కి వెళ్ళిన వాళ్ళు చాలామంది వెనక్కి వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నామని చెప్పారు. గల్ఫ్ కార్మికులను బీఆర్ఎస్ ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంటుందని పేర్కొన్నారు.

తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ కూడా సన్న బియ్యం పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. గతంలో పంపిణీలో పరిమితి ఉండేదని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న ఘనత సీఎం కేసీఆర్ దక్కుతుందని అన్నారు. దానివల్ల ఆకలితో అలమటించే కుటుంబాలు తెలంగాణలో తగ్గిపోయాయని స్పష్టం చేశారు.

మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ధరలు ఆకాశాన్ని అంటాయని, గ్యాస్ సిలిండర్ మనకు అందకుండా పోయి మళ్లీ కట్టెల పొయ్యి పెట్టుకునే పరిస్థితికి వచ్చిందని గుర్తు చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న సీఎం కేసీఆర్ గ్యాస్ బండను రూ. 400 కి అందించాలని మంచి నిర్ణయం తీసుకున్నారని వివరించారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేయడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేశారని తెలియజేశారు. అలాగే, రూ. 15 లక్షల వరకు వైద్య చికిత్స అందించే పథకానికి కూడా సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని అన్నారు. అగ్రవర్ణ పేదల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక గురుకులాన్ని నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు. రైతుబంధు మొత్తాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 12000 కు పెంచుకుంటామని, అలా కొనసాగిస్తూ రానున్న ఐదేళ్ల కాలంలో 16 వేలకు తీసుకెళ్తామని తెలిపారు.

పండించిన పంటకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారని, ఇదే తరహా చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తోందని, కానీ ఎకరానికి 20 క్వింటాళ్లకి పరిమితి విధించిందని, ఆ పరిమితి దాటితే ఒక్క గింజ కూడా కొనుగోలు చేయబోరని వివరించారు. గత పదేళ్లగా వేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చి చివరి గింజ వరకు టిఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వాళ్లు మోసం చేసే మాటలు చెబుతారని, రైతులను కేవలం మూడు గంటలు మాత్రమే కరెంటు ఇచ్చి రైతులను గుల్ల చేయాలన్నది కాంగ్రెస్ ఉద్దేశమని విమర్శించారు.

బీసీలకు సీఎం కేసీఆర్ వ్యతిరేకమని రాహుల్ గాంధీ అంటున్నారని, ఆయన తెలివి ఉండి మాట్లాడుతున్నారో లేక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే సమగ్ర కుటుంబ సర్వే చేసుకుని అన్ని కులాల వివరాలను సేకరించామని చెప్పారు. సామాజిక స్థితిగతులు తెలుసుకున్న తర్వాతనే ఇన్ని పథకాలను మనం రూపకల్పన చేసుకున్నామని, దాంతో పథకాలన్నీ విజయవంతం అయ్యాయని వివరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ హయాంలో కేవలం ఒకే ఒక్క బీసీ సంక్షేమ హాస్టల్ ఉండేదని, సకల జనుల సర్వే చేశాము కాబట్టే ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 34 బీసీ సంక్షేమ హాస్టళ్లు నిర్మించుకోగలిగామని అన్నారు. మరి మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో జీవన్ రెడ్డి, రాహుల్ గాంధీ ఆలోచించుకోవాలని మండిపడ్డారు. కులంతో రాజకీయం చేయడం కాదు… కులవృత్తులకు ఎలా బలాన్ని ఇవ్వాలని ఆలోచించే వారే అసలైన నాయకులవుతారని, ఆ నాయకుడే సీఎం కేసిఆర్ అని తేల్చి చెప్పారు. అందుకే తెలంగాణ సమాజం సీఎం కేసీఆర్ వెనుకే నిలబడుతుందని స్పష్టం చేశారు.

అప్పటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వెంకటస్వామి కేంద్రంలో జౌళి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సిర్పూర్ లోని స్పిన్నింగ్ మిల్లును కాంగ్రెస్ పార్టీ మూసివేసిందని తెలిపారు. రామగుండం మెరుగుల ఫ్యాక్టరీని మూసివేసిందే కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. ఈ దేశంలో ప్రైవేట్ వాళ్లకు బొగ్గు అమ్ముకోవచ్చని నేర్పించి ఆనవాయితీగా చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ఎండగట్టారు. తాడిచెర్ల బొగ్గు గనిని ప్రైవేట్ వాళ్లకు కాంగ్రెస్ పార్టీ అప్పగించిందని విమర్శించారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు ఉంటే గోల్డెన్ హ్యాండ్ షేక్ అనే పథకాన్ని పెట్టి అనేకమంది ఉద్యోగులకు వీఆర్ఎస్ తీసుకునేలా బలవంతం పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకొని బొగ్గు గనులను మనకి ఇవ్వాలని కేంద్రంతో కొట్లాడి సాధించారని చెప్పారు. అనేక గనులు తెరిచి కార్మికులకు డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. దాదాపు 18 వేలకు పైగా డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చుకున్నామని, నోటిఫికేషన్ ద్వారా దాదాపు 5వేలకు పైగా కొత్తగా ఉద్యోగాలు కల్పించామని వివరించారు. కోల్ ఇండియాలో కూడా లేనటువంటి అదనపు వేతనంతో కూడిన సెలవు దినం కూడా సింగరేణి ఉద్యోగస్తులకు కల్పించామని అన్నారు. సింగరేణి కార్మికుల కుటుంబ సభ్యులందరికీ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్య సౌకర్యాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తుందని, కాంగ్రెస్ తీసేసిన 600 మంది సింగరేణి కార్మికులను తిరిగి ఉద్యోగాలకు తీసుకున్నది సీఎం కేసీఆర్ అని తెలియజేశారు. సింగరేణి నిలబెట్టుకోవడమే కాకుండా ప్రతి ఏటా లాభాల్లో కార్మికులకు వాటాలను పంచుతున్నామని చెప్పారు. దాదాపు 30 శాతానికి పైగా వాటాలను కార్మికులకు పంచడమే కాకుండా గతంలో ఉన్న బకాయిలను కూడా విడుదలు చేశామని అన్నారు.

నిజాం షుగర్ ఫ్యాక్టరీని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందని కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి అంటున్నారని, ఈ వ్యాఖ్యలు చూస్తే జీవన్ రెడ్డికి సీనియారిటీ ఉంది కానీ సిన్సియారిటీ లేదన్నది అర్థమవుతోందని విమర్శించారు. 1937లో భారతదేశానికి స్వతంత్రం రాకముందు నిజాం ప్రభువులు షుగర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారని, అందులో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏమీ లేదని స్పష్టం చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ నష్టాల ఊబిలో మునిగిపోవడానికి కాంగ్రెస్ పార్టీ ఏ కారణమని ధ్వజమెత్తారు. 2002లో ఆ ఫ్యాక్టరీనీ తెలుగుదేశం పార్టీ అమ్మేసిందని, అప్పుడు కాంగ్రెస్ పార్టీ చోద్యం చూసిందని అన్నారు. ఆ ఫ్యాక్టరీని కొన్న వ్యక్తి బిజెపి మాజీ ఎంపీ అని, ఫ్యాక్టరీ ఆస్తులను తాకట్టు పెట్టి ఆ బీజేపీ నాయకుడు 150 కోట్ల రూపాయల మేర అప్పులు తీసుకున్నారని తెలిపారు. రైతులకు, కార్మికులకు ఆ ప్రైవేట్ యాజమాన్యం బకాయిలు ఎగ్గొట్టిపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 66 కోట్లు చెల్లించిందని, ఫ్యాక్టరీని పునరుద్ధరించడానికి 2015 లోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని, దాంతో చెప్పా పెట్టకుండా ఆ బిజెపి నాయకుడు లాకౌట్ ప్రకటించారని వివరించారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టుల పరిధిలో ఉంది కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. కార్మికులను కడుపులో పెట్టుకొని కాపాడేది సీఎం కేసీఆర్ మాత్రమేనని, మిగతా వాళ్ళు కల్లిబొల్లి మాటలు చెబుతారని మండిపడ్డారు. న్యాయ సమస్యలు పుట్టించింది ఆ బిజెపి నాయకుడని చెప్పారు.

“జీవన్ రెడ్డి కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడాలి. నన్ను క్వీన్ ఎలిజబెత్ రాణి అని పిలుచుడు కాదు…. నేను మీ ఇటలీ రాణిని కాదు. మీ ఇటలీ రాని లెక్క నేను వందలాది తెలంగాణ బిడ్డల ప్రాణాలను నేను బలి తీసుకోలేదు. మీరు దిగజారిపోయి హోదాను మరిచిపోయి తెలంగాణకు ప్రతీక అయినటువంటి బతుకమ్మను అవమానించినా కూడా నేను సంయమనంతో మాట్లాడుతున్నాను.” అని వ్యాఖ్యానించారు. జగిత్యాల ప్రజలు జీవన్ రెడ్డిని తప్పకుండా తిరస్కరిస్తారని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ బబ్బర్ షేర్ కాదు… ఆయన పేపర్ టైగర్ అని మండిపడ్డారు.

కోరుట్ల అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News