Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Kavitha fire on Revanth: కాంగ్రెస్ రాష్ట్రాల్లో కుర్చీ కోసం కుమ్ములాటలు

Kavitha fire on Revanth: కాంగ్రెస్ రాష్ట్రాల్లో కుర్చీ కోసం కుమ్ములాటలు

అలాంటి అస్థిర ప్రభుత్వాలు మనకు అవసరమా ?

ఇది బీఆర్ఎస్ అభివృద్ధికి, కాంగ్రెస్ అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు అన్నారు. “పోలీసుల పేర్లను రెడ్ డైరీలో రాసుకుంటామని రేవంత్ రెడ్డి అంటున్నారు. రేవంత్ రెడ్డి గారూ… మీ బెదిరింపులకు భయపడేవాళ్లు ఎవరూ లేరు ఇక్కడ.” అని హెచ్చరించారు. అధికారులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారని, ఎన్నికల కమిషన్ పరిధిలో అధికారులు పనిచేస్తున్నారన్న విషయాన్ని మరిచిపోయి ఏదో చెద్దామని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ పేరును మాత్రం తెలంగాణ ప్రజలు రెడ్ డైరీలో ఇప్పటికే రాసుకున్నారని స్పష్టం చేశారు. ఇలా దాడులకు తెగబడితే కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదని నిప్పులు చెరిగారు. బోధన్ లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి షకీల్, కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని కవిత గారు తీవ్రంగా ఖండించారు.

- Advertisement -

నిజామాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో కవిత గారు మీడియాతో మాట్లాడారు. 80 సీట్ల కంటే ఒక్కటి తక్కువగా వచ్చినా ఏదంటే అది చేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నారని, ఇలాంటి సవాళ్లను 10 సార్లు చేశారని, కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని గత ఎన్నికల్లో అన్నారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా రెండు మూడు నెలలకే ప్రభుత్వం అస్థిరమైతుందని స్పష్టం చేశారు. కర్నాటకలో అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాకముందే కుమ్ములాటలు మొదలయ్యాయని, ఇప్పటికే సిద్దరామయ్య, డీకే శివ కుమార్ పోటీ పడుతుంటే కొత్తగా సతీష్ అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే తానే సీఎం అవుతానని అంటున్నారని చెప్పారు. రాజస్థాన్ లో అశోక్ గెహ్లోట్, సచిన్ పైలట్ ఎప్పుడూ కొట్లాడుకుంటూనే ఉంటారని, మధ్య ప్రదేశ్ లో ప్రజలు అధికారం ఇస్తే కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియా కొట్లాడుకొని ఏడాదిలోనే ప్రభుత్వాన్ని కూల్చేశారని వివరించారు. కాబట్టి తెలంగాణకు కూడా పూటకో ముఖ్యమంత్రి కావాలా, మనకూ అస్థిరమైన పరిపాలన కావాలా అన్నది ఆలోచన చేయాలని ప్రశ్నించారు. రాజకీయ సుస్థితం, సరైన శాంతి భద్రతల వల్లనే హైదరాబాద్ కు పరిశ్రమలు వస్తున్నాయని, ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని అన్నారు. మంచినీళ్లు కూడా ఇవ్వని వ్యక్తులు రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో అర్థం చేసుకోవాలన్నారు.

ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం జిల్లాలకు ఐటీ రంగాన్ని విస్తరిస్తోందని, కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ జిల్లాలకు అల్లర్లను విస్తరించిందని మండిపడ్డారు. ఎవరు ఏం చేస్తారో చేసుకోండి అన్నట్లు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ బోధన్ అభ్యర్థి షకీల్ పై కాంగ్రెస్ నేతలు దాడి చేశారని, నిజామాబాద్ జిల్లాకు వచ్చిన రేవంత్ రెడ్డి కొంత బాధ్యతగా మాట్లాడుతారని అంతా అనుకున్నారని కానీ ఉల్టా పోలీసులను విమర్శిస్తున్నారని వివరించారు. ఇలా రౌడీయిజం, గూండాయిజాన్ని ప్రోత్సహించేవాళ్లకు పట్టం కట్టవద్దని, వారికి ఎక్కడికక్కడా నిరసనను తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఎవరి కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్లాటలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఢిల్లీ నంచి వచ్చి కాంగ్రెస్ నేతలు అనేక మాట్లాడుతున్నారని, ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏం తప్పు చేసిందని అడిగారు. బీఆర్ఎస్ తో ఒక చిన్న తప్పైనా జరిగిందా అని ప్రశ్నించారు. తాము అభివృద్ధి వైపు వెళ్లుంటే వాళ్లు అరాచకం వైపు వెళ్తున్నారని అన్నారు. ఈ ఎన్నిక అభివృద్ధి, అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అని, ఎటు వైపు ఉంటారో ప్రజలు ఆలోచించాలని కోరారు.

నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజాదరణ పెరుగుతోందని, దాన్ని జీర్ణం చేసుకోలేక తమ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలపై భౌతిక దాడికి దిగడం చాలా హేయమైన అంశమని అన్నారు. రౌడీల్లా, వీధి గూండాల్లా కాపుకాసి మాటు వేసి తమ అభ్యర్థులపై దాడి చేయడం దారుణమని ఖండించారు. మొన్న దుబ్బాకలో, నిన్న మంథనిలో, ఈ రోజు బోధన్ లో జరిగిందని, కాంగ్రెస్ పార్టీ నిజమై స్వరూపం, సంస్కృతి బయటపడుతున్నదని తెలిపారు. కాంగ్రెస్ చరిత్ర అంతా కూడా ప్రతీ చోట అల్లర్లు, అరాచకాలు, దాడులు చేయడంతోనే గడిచిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1990లో, 19191లో , 1992లో, 1998లో, 2007లో , 2012లో నిజామాబాద్, రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్, మెదక్, అదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ లో రకరకాల అల్లర్లు, గూండాయిజం పేరిట ప్రజల మధ్యలో చిచ్చు రేపారని, ప్రజల మధ్యలో అల్లకల్లోలం రేపడంలో కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని స్పష్టం చేశారు. 1990 నుంచి 2012 మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో 10 దఫాల్లో 113 రోజుల పాటు కర్ఫ్యూ పెట్టారని గుర్తు చేశారు. బోధన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే ప్రజలు ఏమి చేస్తారో చెప్పాలని, కానీ ఇలా ఇలా గూండాయిజం, రౌడీయిజం చేయడం ఎందుకని ప్రశ్నించారు. అభద్రతాభావంతో ఉన్నారని ఆరోపించారు. ప్రజల మనసు గెలుచుకొని సీట్లు తెచ్చుకోలేక తమ అభ్యర్థిపై దాడి చేస్తే వచ్చేదేమిటని అడిగారు.

గత 10 ఏళ్ల కాలంలో చిన్న మతకల్లోలం లేకుండా, రౌడీలు, గూండాలు లేకుండా పరిపాలన సాగిస్తున్న సందర్భంగా రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తున్నాయని చెప్పారు. ఆ పరిశ్రమల ద్వారా లక్షల సంఖ్యలో పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయని పేర్కొన్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా అన్నది తల్లిదండ్రులు ఆలోచించాలని, కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసమే పనిచేద్దామా, ప్రైవేటు పెట్టుబడులు మనకు వద్దా అన్నది ఆలోచించాలని కోరారు. 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చామని, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ 24 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని, అందులో తెలంగాణ ప్రాంతానికి కేవలం 10 వేల ఉద్యోగాలు వచ్చాయని, అంటే ఏటా వెయ్యి ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని వివరించారు. అధికారంలోకి రాగానే 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కర్నాటకలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కానీ చిన్న ముందడుగు పడలేదని ఎండగట్టారు. బళ్లారిలో ప్రపంచ జీన్స్ కేపిటల్ చేస్తానని రాహుల్ గాంధీ అన్నారని, కానీ అక్కడ కరెంటు లేక ఫ్యాక్టరీలు మూతబడుతున్న పరిస్థితి ఉందని అన్నారు. ఇటువంటి వాళ్లు వచ్చి తమకు పాఠాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. తమతో కాంగ్రెస్ పార్టీ పనితీరులో, నాయకత్వంలో, చిత్తశుద్దిలో ఎక్కడాసాటిరాదని, మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎన్నుకోవాలి ప్రశ్నించారు. యువతను పకోడీలు వేసుకోవాలని బీజేపీ పార్టీ అంటున్నదని, కాంగ్రెస్ పార్టీ యువతను అరాచకంవైపు తీసుకెళ్తున్నదని విమర్శించారు. సీఎం కేసీఆర్ మాత్రం మన బిడ్డలు డాక్టర్లు,ఐఏఎస్ లు,ఐపీఎస్ లు కావాలని ఆంకాంక్షిస్తున్నారని తెలిపారు.

నిజామాబాద్ జిల్లాలో గత ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన టికెట్లను ఈ సారి ఇతరులకు ఇచ్చి తమ పార్టీ నిజామాబాద్ రూరల్ అభ్యర్థి బాజీరెడ్డి గోవర్ధన్ పై మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. బాజీరెడ్డి ఆర్టీసీ చైర్మన్ గా ఉన్న సమయంలోనే ఆ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేశామని, ఉల్టా ఆర్టీసీ ఉద్యోగులకు అన్యాయం చేసినట్లు రేవంత్ రెడ్డి మాట్లాడడం తగదని స్పష్టం చేశారు. ఎస్సారెస్పీని చూపించి ఓట్లు అడుగుతాం బీఆర్ఎస్ ఏం చూపించి ఓట్లు అడుగుతుందని రేవంత్ రెడ్డి అన్నారని, నిజామాబాద్ జిల్లాకు వచ్చి రేవంత్ రెడ్డి చూడాలని, గత కంటే మూడు రెట్ల ఆయకట్టు పెరిగిందని స్పష్టం చేశారు. ఆ ప్రాజెక్టును జవహార్ లాల్ నెహ్రూమొదలుపెడితే తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పూర్తి చేశారని వివరించారు. ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇస్తున్నదని సీఎం కేసీఆర్ అని, కాబట్టి ఎస్సారెస్పీ గురంచి మాట్లాడే అధికారం, హక్కుకాంగ్రెస్ పార్టీకి లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్ జిల్లాలో ఓటు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్ , మేయర్ దండు నీతు కిరణ్, సీనియర్ పార్టీ నాయకులు అలీమ్ , రాజా రామ్ యాదవ్ , మధు , ఖుద్దుస్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News