ఓవైపు లోక్ సభ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా ఏకంగా కేటీఆర్ మాజీ సన్నిహితుడు చడీ చప్పుడు లేకుండానే కాంగ్రెస్ లోకి చేరడం సంచలనం సృష్టిస్తోంది. మొత్తానికి ఇకమీదట కేసీఆర్ కు రోజూ షాక్స్ తప్పేలా లేవని పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్ జరిగేలా పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి.
జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా మున్షీ సమక్షంలో బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై బాబా ఫసియుద్దీన్ కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమకారులకు పార్టీలో ప్రాధాన్యం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో తనకు ప్రాణహాని ఉందని చెప్పిన అధిష్టానం పట్టించుకోలేదంటూ బాబా చెప్పారు. 22 సంవత్సరాలు గుండెల నిండా గులాబీ జెండాతో పనిచేసిన తనకు పార్టీలో రక్షణ కరువైందని వాపోయారు. అందుకే బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వంతో పాటు మీడియా అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.