ఎన్నికలకు ముందు దళితులను, గిరిజనులను డిక్లరేషన్ పేరిట మభ్య పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. దేశంలో 40 కోట్ల మందికి పైగా దళిత, గిరిజనులున్నారని, 50 సంవత్సరాలకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజనులను మోసం చేసి, వంచించి ఓట్లు వేసుకుందన్నారు మంత్రి. కాంగ్రెస్ మాటలు నమ్మేందుకు దళిత గిరిజనులు అమాయకులు కారన్న ఆయన.. మల్లికార్జున్ ఖర్గే ఈ డిక్లరేషన్ ను తెలంగాణలో కాదు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, దేశ వ్యాప్తంగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు కొప్పుల.
ఇన్నేళ్లు ఈ పథకాలు అమలు చేయాలని కాంగ్రెస్ కు ఆలోచన ఎందుకు రాలేదని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ హాయాంలో దళిత, గిరిజన విద్యార్థుల కోసం ఇన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు కాలేజీలు పెట్టారా అన్న మంత్రి కొప్పుల, తమ హయాంలో మొత్తం 1006 రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టినట్టు సగర్వంగా వివరించారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో దళిత గిరిజనులకు అడ్మిషన్లు దొరుకుతున్నాయంటే అది రెసిడెన్షియల్ విద్య ఫలితమేనన్నారు. …కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దళిత బంధు లాంటి పథకం ఎందుకు లేదన్నారు మంత్రి. కేసీఆర్ తరహా లో దళిత బంధు పెట్టాలని కాంగ్రెస్ నేతలు ఎందుకు ఆలోచించలేదని కొప్పుల ఈశ్వర్ అన్నారు.