కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంట్ కష్టాలు మొదలయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాత్రి 11:15 గంటల నుంచి వ్యవసాయానికి త్రీ ఫేజ్ కరెంట్ వస్తుందని ఎన్‌పీడీసీఎల్ రైతులకు మేసేజ్‌లు పంపుతుందని ఆయన తెలిపారు. దీంతో రైతులు అర్ధరాత్రి పూట బావుల వద్ద పండుకునే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లా ఇరుకుళ్ళ గ్రామంలో సాగు నీరందక ఎండిన వరి పంట పొలాలను వినోద్ కుమార్ నేతృత్వంలో కేటీఆర్, గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ రైతులతో మాట్లాడారు.అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితిని చూడలేదని రైతులు తెలిపారు. మొదటిసారి ఇవాళ పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేల నెర్రెలు బారుతోందని, మార్చి మొదటి వారంలోనే ఇట్ల పరిస్థితి ఉందంటే.. ఏప్రి, మే నెలలో పరిస్థితి ఏందోనని రైతులు భయపడుతున్నారు. ఎస్సార్ఎస్పీలో నీళ్లు ఉన్నప్పటికీ కక్షతో కొన్ని నియోజకవర్గాలకు నీళ్లు ఇస్తాలేరని రైతులు వాపోయారని కేటీఆర్ తెలిపారు. రేవంత్ ప్రభుత్వం చిల్లర రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఏ నియోజకవర్గంలోనైనా రైతులు రైతులే అని స్పష్టం చేశారు. ఎస్సార్ఎస్పీ నుంచి సాగునీరు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం కాపలా కాసే పరిస్థితి
12 ఏండ్ల తర్వాత మళ్లీ మొదటిసారి కరెంట్ కోసం అర్ధరాత్రి పూట బావుల వద్ద పండుకునే పరిస్థితి వచ్చిందని రైతులు చెబుతున్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి మొన్నటి వరకు ఆ పరిస్థితి లేకుండే. ఇవాళ కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం కాపలా కాసే పరిస్థితి వచ్చిందని రైతులు చెప్పారని తెలిపారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు.. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి ఒక కామధేనువు, కల్పతరువు లాంటి ప్రాజెక్టు. మేడిగడ్డలో రిపేర్లు చేయకుండా రైతుల కొంప పుచ్చుకుంటుంది ఈ ప్రభుత్వం. రైతుల మీద ప్రేమ ఉంటే కాఫర్ డ్యామ్ కట్టి.. నీళ్లు మళ్లించి, లిఫ్ట్ చేసి పంటలను కాపాడాలని కోరుతున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
24 గంటల కరెంట్ ఇస్తున్నామని ఊకదంపుడు ఉపన్యాసాలు
బయట ముఖ్యమంత్రేమో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని నరుకుతున్నాడు. రైతాంగానికి అది చేస్తున్నాం.. ఇది చేస్తున్నాం అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నాడు. ఇక్కడ క్షేత్రంలో చూస్తే పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఇవాళ నా పది ఎకరాల పంట పోయింది ఎవరు బాధ్యులు అని ఓ రైతు ప్రశ్నించాడు. సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఎండిపోయిన పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలి. క్వింటాల్‌కు రూ. 500 బోనస్‌పై నిర్ణయం తీసుకొని జీవో ఇవ్వండి. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అని తప్పించుకోకండి. ఈ పంట సీజన్‌లోనే బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.