కేసీఆర్ అధికారంలో కాదు ప్రతిపక్షంలో ఉండటమే డేంజర్ అంటూ కేటీఆర్ సరికొత్తగా మాట్లాడి, పొలిటికల్ హీట్ రాజేశారు. సీఎం అనే రెండక్షరాల కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ ఫుల్ అంటూ నిప్పులు చెరిగేలా ప్రసంగించిన ఆయన తనయుడు కేటీఆర్, ఫిబ్రవరిలో కేసీఆర్ జనంలోకి వస్తారని తేల్చి చెప్పారు.
ఖమ్మం లోక్ సభ నియోజక వర్గం మీటింగ్ తెలంగాణ భవన్ లో జరుగుతుండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఇలా తమ క్యాడర్ లో జోష్ నింపే పని చేయటం హైలైట్. అధికారంలో ఉన్నప్పటి కన్నా ప్రతిపక్షంలో ఉంటేనే మరింత పోరాట పటిమ చూపగలమన్న కేటీఆర్.. మనమంతా ఉద్యమంలో గట్టిగా పోరాడిన వాళ్ళమేనంటూ గతాన్ని గుర్తుచేశారు. రానున్న రోజుళ్లో కేసీఆర్ అసెంబ్లీ కొస్తే ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటూ బీఆర్ఎస్ లో ఉత్సాహం నింపారు. పార్లమెంటు నియోజక వర్గాల సమీక్షలు ముగియగానే అసెంబ్లీ నియోజక వర్గాల సమీక్షలు ఉంటాయన్న ఆయన.. త్వరలోనే రాష్ట్ర, జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతీ రెండు మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశాలు క్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తామని, ఖమ్మం సీటును కచ్చితంగా గెలవాల్సిందేనంటూ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.