Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Kurnool: సమగ్రాభివృద్ధికై కలెక్టరేట్ వద్ద సిపిఎం మహాధర్నా

Kurnool: సమగ్రాభివృద్ధికై కలెక్టరేట్ వద్ద సిపిఎం మహాధర్నా

ఆదోని నుండి కర్నూలుకు 120 కిలోమీటర్లు సాగిన మహాపాదయాత్ర

కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధి కోసం సిపిఎం పార్టీ ఆగస్టు రెండవ తారీకు నుండి తలపెట్టినటువంటి మహా పాదయాత్ర ఏడవ రోజు తాజ్ ఫంక్షన్ హాల్ నుండి బయలుదేరి రేణుక ఎల్లమ్మ దేవాలయం, రేడియో స్టేషన్, వై జంక్షన్, బళ్లారి చౌరస్తా, కొత్త బస్టాండ్, రాజ్ విహార్, మెడికల్ కళాశాల మీదుగా కలెక్టరేట్ వరకు పాదయాత్ర బృందం వెనుక వేలాదిమందితో మహా ప్రదర్శన నిర్వహించారు.

- Advertisement -

ఈ మహా ప్రదర్శనకు వివిధ రకాల కార్మిక, విద్యార్థి, యువజన, మహిళా, మైనారిటీ, సామాజిక సంఘాలు మరియు సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో అడుగడుగునా పూలమాలలేసి, పూల వర్షం కురిపిస్తూ, బాణసంచా పేలుస్తూ, తిలకం దిద్ది, హారతి లిస్తూ ఘనంగా స్వాగతం పలికారు. ఆదోని నుండి కర్నూలు వరకు 120 కిలోమీటర్ల పాటు పాదయాత్ర సాగింది.

అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఏర్పాటుచేసిన మహా ధర్నా కార్యక్రమ వేదిక పైకి సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నిర్మల పాదయాత్ర బృందానికి నాయకత్వం వహించిన సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయి, ఏడు రోజులపాటు పాదయాత్రలో నడిచిన సిపిఎం జిల్లా నాయకులు పి ఎస్ రాధాకృష్ణ, కె వెంకటేశ్వర్లు, జి రామకృష్ణ, కె.వి నారాయణ, యం డి ఆనంద్ బాబు, వై నగేష్, సి గురుశేఖర్ లతో పాటు మహిళా నాయకులు డి విజయమ్మ, మల్లయ్య లను కరతాల ధ్వనుల మధ్య ఆహ్వానించారు.

సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయి అధ్యక్షతన జరిగిన మహాధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు మాట్లాడుతూ ఇప్పటిదాకా రాజకీయ వ్యక్తిగత ప్రయోజనం కోసమో, లేదా వాళ్ళ ఆరోగ్యం కోసమో నడిచే వాళ్ళను మనం చూసి ఉంటామని కానీ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజా సంక్షేమం కోసం మా నాయకులు నడిచారన్నారు. గతంలో కూడా మేము ఇలాంటి పాదయాత్రలు చేసినప్పుడు వెంటనే ఈ ప్రాంతాలకు వచ్చి, శంకుస్థాపనలు చేసి ఇక అయిపోయింది, అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయినాయి అంటూ గెంతు లేశారన్నారు. కానీ వారు వేసిన శిలాఫలకాలు రాళ్లు తేలిపోయి, మాటలు గాలికి కలిసిపోయాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాలలో కర్నూలు జిల్లా అత్యంత వెనుకబడిందన్నారు. చదువులోనూ, పరిశ్రమల్లోనూ, సామాజికంగానూ తీవ్రమైన వెనుకబాటు ఉందన్నారు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 15 సందర్భంగా కర్నూలుకు వస్తూ రోడ్లకు రంగులేసి మొత్తం మారిపోయిందన్నారని, ఆయన రంగులేస్తే నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏకంగా జిల్లాకు పంగనామాలు పెడుతున్నారన్నారు.

ఆర్థిక శాఖ మంత్రి ఇక్కడివారే అని ప్రజలు సంకలు గుద్దుకున్నారని, ఇక్కడి నుండి పట్టుకెళ్ళడమే తప్ప ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించలేదని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన వద్ద ఫైనాన్సు లేదు, పైసలు లేవని ఎద్దేవా చేసారు. వెనకబడిన ప్రాంతం వెనుకబడిన ప్రజలకు చేసే బాధ్యతాయుతమైన పనిగా గుర్తించాలని ఇలాంటి మంత్రులు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండడం దేనికని రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలన్నారు. కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే కర్నూల్ రైల్వే స్టేషన్ ను చాలా నున్నగా మార్చామని, కాలు కింద పెట్టకుండా ఎక్కిపోవచ్చని కితా బిచ్చుకుంటున్నారన్నారు. కర్నూలు నుండి విజయవాడకు వెళ్లే ఒక్క రైలు కూడా లేకుండా ఆ మాట మాట్లాడడానికి సిగ్గు లేదా అని విమర్శించారు. గుండ్రేవుల ప్రాజెక్టు ఏమైందని, 20 టీఎంసీల నీళ్లు వస్తే జిల్లా సస్యశ్యామలమవుతుందని వేదవతి మీద ప్రాజెక్టులు కడితే ఆదోని ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ నీళ్లు వస్తాయన్నారు. హంద్రీనీవా కాలువ ఉంది. కాల్వకట్టకు రెండు రిజర్వాయర్లు కట్టి రిజర్వాయర్ సైజు తగ్గించారన్నారు. జిల్లాలో ఉన్న చెరువులను నింపి పిల్ల కాలువలకు నీళ్లు ఇస్తే ప్రజలకు తాగు, సాగునీటి సమస్యలను పరిష్కరించవచ్చన్నారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ అన్న మాటే గాని ఇప్పటిదాకా ఉపయోగంలోకి తీసుకు రాలేదన్నారు. జిల్లాలో ప్రజలంతా సమస్యలతో నలుగుతుంటే, జిల్లా ప్రజా ప్రతినిధులు మాత్రం కమీషన్లతో కులుకుతున్నారని ఇప్పటికైనా సమస్యలపై దృష్టి సారించకపోతే ప్రజా ప్రతినిధులకు శంకరగిరి మాన్యాలు తప్పవన్నారు.


మహాధర్నా కార్యక్రమంలో జిల్లా నాయకులు రామాంజనేయులు, అంజిబాబు, నాగేశ్వరరావు, లింగన్న, లక్ష్మన్న, వీరశేఖర్, హనుమంతు, అబ్దుల్లా, రాఘవేంద్ర, కృష్ణ, కరుణాకర్, వెంకట రాముడు, కర్నూల్ న్యూ సిటీ, ఓల్డ్ సిటీ కార్యదర్శులు రాముడు, రాజశేఖర్, నాయకులు నరసింహులు, సాయిబాబా, విజయ్, సుధాకరప్ప, ప్రభాకర్, రామకృష్ణ తో పాటు ఐదు వేల మంది మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా రెవెన్యూ శాఖ అధికారి నాగేశ్వరరావుకు మెమొరాండం సమర్పించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News