Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Mantralayam: మంత్రాలయంలో గెలుపెవరిది?

Mantralayam: మంత్రాలయంలో గెలుపెవరిది?

మంత్రాలయంలో ఆసక్తిరేకెత్తిస్తున్న రాజకీయాలు

శ్రీ రాఘవేంద్ర స్వామి సన్నిధి హాట్ హాట్ పాలిటిక్స్ కు వేదికగా మారింది. ఈ పుణ్యక్షేత్రంలో ఈసారి గెలుపెవరిది అన్నది అత్యంత ఆసక్తికరంగా పెద్ద చర్చనీయాంశమైంది. వైఎస్ఆర్సిపి అభ్యర్థి వై. బాలనాగిరెడ్డి ఇప్పటికే మూడుసార్లు గెలిచి తన సత్తా చాటుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి పథకాలను నియోజకవర్గ ప్రజలకు అందేలా చూస్తూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో గడప గడపకు కార్యక్రమంలో ఆయన బాగానే దూసుకుపోతున్నారు. గడప గడపకు కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి యువనేత వై ప్రదీప్ రెడ్డి ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తూ స్థానికులకు అండగా ఉన్నారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా కలియదిరుగుతూ ప్రభుత్వ పథకాలతో పాటు తాను చేసిన అభివృద్ధి వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

- Advertisement -

నియోజకవర్గం ఐదు లిఫ్టు ఇరిగేషన్లు తెచ్చిన ఘనత తనదే అంటూ చెప్పుకుంటూ, ఈసారి కూడా గెలుపు నాదే అనే ధీమా వ్యక్తంచేస్తున్నారు. గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి తిక్కారెడ్డి బాలనాగిరెడ్డి చేతుల్లో ఓడిపోయి, ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో విస్తృతంగా ప్రచార కార్యక్రమాల్లో మరింత జోరు పెంచి, ఓటర్లను ఆకట్టుకోవటంలో నిమగ్నమై ఉన్నారు. తన సోదరులతో కలిసి మంత్రాలయం నియోజకవర్గంలో పర్యటిస్తూ చంద్రబాబు అరెస్టుపై భారీఎత్తున నిరసనలు, ధర్నాలు, దీక్షలు కొనసాగిస్తున్నారు. టిడిపి టికెట్ బీసీలకే ఇవ్వాలని కౌతాళం మండలానికి చెందిన సీనియర్ టిడిపి నాయకులు ఉలిగయ్య, ముత్తిరెడ్డి రామిరెడ్డిలు ప్రయత్నిస్తుండటంతో తిక్కారెడ్డికి అంతర్గత పోరు కూడా సెగ రాజేస్తోంది.

మంత్రాలయం నియోజకవర్గంలో వాల్మీకుల అధిక సంఖ్యలో ఉన్నారని బీసీలకు ఇస్తే తప్పకుండా గెలిచి తీరుతామని వారంటున్నారు. ఇప్పటికే తిక్కా రెడ్డి జనసేన పార్టీ నాయకులతో కలిసి వివిధ రూపాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈసారి చంద్రబాబు టికెట్ తనకే ఇస్తాడని బాలనాగిరెడ్డిపై, తప్పకుండా గెలిచి నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకుంటానని ఆయన సర్వం ఒడ్డుతున్నారు. దీంతో ఇక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

మూడుసార్లు గెలిచిన స్థానిక ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిపై గెలవడమంటే అంత సులువైన పని కాదని, కేవలం ఆర్భాటాలకు మాత్రమే ఓట్లు వేసే పరిస్థితి నేడు లేదని ప్రజల్లో మమేకమై ప్రజల్లో నిరంతరం ఉండేవారికే విజయావకాశాలని ఇక్కడి ప్రజలు అంటున్నారు. ఇక క్షేత్రస్థాయి విషయానికి వస్తే అసలు జనసేన-టిడిపీ ఏకమై తిక్కారెడ్డి గెలుపు కోసం కృషి చేస్తారా అన్నది అసలు పాయింట్. బాబు జైలు నుంచి బయటికి వచ్చాక మంత్రాలయం టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డా లేక బీసీ అభ్యర్థా అన్నది తేలాకే ఈ విషయాలపై స్పష్టత వస్తుంది. నిజానికి గత ఎన్నికల్లో కూడా తిక్కారెడ్డికి నియోజకవర్గంలోని కొంతమంది బీసీ నాయకులు సపోర్టు చేయలేదు. అందుకే ఆయన ఓటమి చవి చూశారని, ఇప్పుడు చేస్తారా లేదా అన్నదానిపై ఇక్కడి టీడీపీ గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News