రాష్ట్ర అధ్యక్షుడిగా టికెట్లు అమ్ముకోవడంతో పాటు పాదయాత్ర పేరిట పార్టీ ఫండ్ దుర్వినియోగం చేశాడనే ఆ పార్టీ అధిష్టానం బండి సంజయ్ ను పదవి నుండి మెడలు పట్టి గెంటేసిందని.. దీంతో తనకు ఎక్కడ ఎంపీ టికెట్ రాదోనని ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగాడని బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం నగునుర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన గంగుల.. బండిపై తీవ్ర ఆరోపణలు చేశారు. డప్పు చప్పుళ్ళతో గ్రామస్థులు పెద్ద ఎత్తున మంత్రి గంగుల స్వాగతం పలుకగా..ఇంటింటికి తిరుగుతూ గంగుల ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో నాపై రెండుసార్లు తుక్కు తుక్కు ఓడిపోయిన సంజయ్ నేడు అవినీతి సొమ్ముతో ఓటుకు 20 వేలు, సెల్ ఫోన్లు ఇచ్చి గెలిచేందుకు చూస్తున్నాడని పేర్కొన్నారు. బండి సంజయ్ ఇచ్చే డబ్బులు మనవేనని, అవి తీసుకొని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల్లోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని..కెసిఆర్ లేని తెలంగాణ కుక్కలు చింపిన విస్తరిలా చేస్తారని ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపీ కాంగ్రెస్ లు తెలంగాణ ను మోసం చేసాయని…ఇప్పుడిప్పుడే తెల్లముఖం అయ్యిందని అన్నారు.
తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాలు ఆనందంగా ఉన్నాయని, పచ్చని తెలంగాణపై మళ్ళీ ఆంధ్రోళ్ల కన్ను పడిందని అన్నారు. కాంగ్రెస్ బీజేపీలు దోఖాబాజి పార్టీలని..మరోసారి తెలంగాణను దోచుకునేందుకు ఆంధ్ర నాయకులు బీజేపీ కాంగ్రెస్ రూపాల్లో వస్తున్నారని తస్మాత్ జాగ్రత్త అన్నారు. ఓటు పవిత్రమైనదని ఒక్క ఓటు తప్పు జరిగితే యాభై ఏళ్లు వెనక్కి వెళ్తుందని అన్నారు. రౌడీ షీటర్, కబ్జాకోరుకు కాంగ్రెస్ పార్టీ డబ్బులకు టికెట్ అమ్ముకుందని ఆరోపించారు. బ్యాలెట్ బాక్సులో కింద దొంగలు ఉంటారని ..నంబర్ వన్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.