గుండెల్లో గూడు కట్టుకున్న అభిమానాన్ని ఒక్కోరు ఒక్కోలా ప్రదర్శిస్తారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మేదరి సంఘం సభ్యులు మాత్రం వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు నామినేషన్ కోసం అవసరమయ్యే డబ్బులను తమ అభిమాన నాయకుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు తులాభారం ద్వారా అందించారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బండ్లగేరిలో మేదరి సంఘం ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన మంత్రిని భారీ క్రేన్ ద్వారా పూలమాలతో స్వాగతం పలికి, మంత్రి నిలువెత్తు బరువున్న రూపాయి నాణేలతో ఆయనకు తులాభారం వేశారు. ఈ డబ్బులను రాబోయే ఎన్నికల్లో నామినేషన్ ఖర్చుల కోసం వినియోగించుకోవాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఊహించని రీతిలో తనపై ఇంతటి అభిమానం ప్రదర్శించడం ఎప్పటికీ మర్చిపోలేనని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మరోసారి విజయం సాధించాలని ప్రజలు తమ ఆదరాభిమానాలను ఈ విధంగా ప్రదర్శించడం తమకు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తోందని తెలిపారు.