“శాసన సభ,మండలి నాలుగు రోజుల వర్ష కాల సమావేశాలు నేటితో ముగిశాయి. అసెంబ్లీ 26 గంటల 45 నిమిషాలు పాటు,మండలి 23గంటల 10 నిమిషాల పాటు సమావేశమయ్యాయి. ఎప్పటి మాదిరిగానే ఈ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కూడా సాఫీగా, ప్రశాంతంగా సాగాయి. ప్రజాస్వామ్య బద్ధంగా ఎంతో ఉన్నతంగా అర్థవంతంగా ఉభయ సభల్లో చర్చలు జరిగాయి. ఎలాంటి అవాంతారాలు లేకుండా,సభ్యుల సస్పెన్షన్లు లేకుండా ఉభయ సభల జరగడం సంతోషంగా ఉన్నది. చారిత్రాత్మక ఆర్టీసీ విలీన బిల్లును ఆమోదించుకోవడంతో మేము కేబినెట్లో తీసుకున్న నిర్ణయానికి ఆమోద ముద్ర వేసి నట్టయ్యింది. ఇది సీఎం కేసీఆర్ గారి విశ్వసనీయతకు నిదర్శనం. గవర్నర్ గారు వివరణలు కోరిన నాలుగు బిల్లులను తిరిగి ఉభయ సభలు ఆమోదించాయి. గవర్నర్ అడిగిన అన్ని వివరణలకు బిల్లులను తిరిగి ఆమోదించిన సందర్భంగా మా మంత్రులు సంతృప్తి కరమైన వివరణలు ఇచ్చారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం సందర్భంగా సభ్యులు అడిగిన వాటికి మంత్రులు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు. స్వల్ప కాలిక చర్చలు,రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఉభయసభల ద్వారా ప్రజలకు వివరించే అవకాశం మాకు కలిగింది. వర్షాలు వరదల పరిస్థితి పై ఉభయ సభలు క్షుణ్ణంగా చర్చించాయి. వరద బాధితులకు ఈ చర్చల ద్వారా ప్రభుత్వం భరోసా కల్పించింది. తొమ్మిదిన్నర ఏళ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతి పై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి కేసిఆర్ రెండు గంటల 20 నిమిషాల సేపు మాట్లాడి అన్ని విషయాలను వివరించారు. ఉభయ సభలు హుందాగా నడిపిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ గార్లకు, కౌన్సిల్ ఛైర్మన్,డిప్యూటీ ఛైర్మన్ గారికి ధన్యవాదాలు. అట్లాగే శాసనసభ, మండలి సాఫీగా, సజావుగా నడిచేలా సహకరించిన గౌరవ మంత్రులకు,ప్రభుత్వ విప్ లకు,ఎమ్మెల్యేలకు,ఎమ్మెల్సీలకు, అసెంబ్లీ సిబ్బందికి, అధికారులకు, పోలీసులకు, ప్రసార మాధ్యమాల ద్వారా సభల చర్చను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు,ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.”
- శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి