పేదలకు, బలహీనవర్గాలకు సెంటు స్థలం ఇస్తామన్న మిషతో జగన్ ప్రభుత్వం ఏడు వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. యువ గళం పాదయాత్రలో భాగంగా ఆయన ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ, పేదలకు సెంటు భూమి పేరుతో జగన్ ఒక కొత్త కుంభకోణానికి తెర తీశారని వ్యాఖ్యానించారు.
ఈ 7,000కోట్ల రూపాయల అవినీతితో పాటు జగన్ ప్రభుత్వం ఇళ్లు కట్టుకోవడానికి పనికి రాని భూములను చదును చేస్తామన్న పేరుతో మరో 2,200 కోట్ల రూపాయలను కూడా స్వాహా చేస్తోందని లోకేష్ ఆరోపించారు. వర్షం పడిందంటే ఈ భూమి ఈతకొలనులుగా మారిపోతుందని, జగన్ వేసిన పునాదులు కూడా మాయమైపోతాయని ఆయన అన్నారు. వై.ఎస్.ఆర్.సి.పికి చెందిన ఎంపీలకు కేసుల నుంచి బయటపడడానికి పథకాలు, వ్యూహాలు రూపొందించడానికే సమయమంతా సరిపోతోందని, ప్రత్యేక హోదా విషయంలో ప్రజలకు చేసిన వాగ్దానం ఏమైందీ వారు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
వచ్చే ఏడాది జరగబోయే శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పాటు దర్శిని అభివృద్ధి చేయడానికి, దొనకొండలో పారిశ్రామిక కారిడార్ ను నెలకొల్పడానికి తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. జగన్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందడం, యువతకు ఉద్యోగాలు లభ్యం కావడం అసాధ్యాల్లోకెల్లా అసాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు.