వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అడుగడుగునా అడ్డుకుంటోందని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. విశాఖ పర్యటనకు వెళ్లినప్పుడు తనను వాహనం నుంచి, హోటల్ గది నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారని..విశాఖను వదిలి వెళ్లిపోవాలని ఒత్తిడి చేశారని గుర్తుచేశారు. ఆ తర్వాత ఇప్పటం పర్యటనకు వెళ్లకుండా.. మంగళగిరిలో తన వాహనాన్నీ అడ్డుకున్నారని, నడిచి వెళ్లేందుకు కూడా ఆటంకాలు కలిగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజాగా తన ప్రచార రథం వారాహి విషయంలోనూ ఎక్కడలేని వివాదాన్ని సృష్టిస్తున్నారని వాపోయారు. ప్రచార రథానికి వేసిన రంగుని మార్చాలని నిన్న ఆదేశించిన విషయం తెలిసిందే.. అయితే అదే రంగు(ఆలివ్ గ్రీన్) లో ఉన్న షర్ట్ ఫొటోని పోస్ట్ చేస్తూ.. కనీసం ఈరంగు షర్టైనా వేసుకోవచ్చా ? అని వ్యంగ్యంగా అడిగారు. ఊపిరైనా తీసుకోమంటారా లేక అది కూడా ఆపేయమంటారా ? అని ఫైరయ్యారు పవన్ కల్యాణ్.
కాగా.. వారాహి వాహనం రంగుపై మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఆలివ్ గ్రీన్ రంగు కేవలం మిలిటరీ వాహనాలకు మాత్రమే వాడతారని.. వారాహికి ఆ రంగు వేయడం చట్ట విరుద్ధమని అన్నారు. లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్ కల్యాణ్ కు మోటార్ వెహికల్ యాక్ట్ పుస్తకాన్ని చదివే సమయం దొరకలేదా? అని ప్రశ్నించారు. డబ్బులు ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాన్లను కొనుక్కుని యుద్ధం చేస్తామంటే కుదరదన్నారు. పేర్ని నాని వ్యాఖ్యలపై పవన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.