MP Avinash Reddy Arrest : వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నికలు మంగళవారం (ఆగస్టు 12, 2025) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో జరుగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించాయి. ఈ నేపథ్యంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించగా, అవినాష్ నిరసనకు దిగారు. వైసీపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టి, ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ALSO READ: https://teluguprabha.net/news/pulivendula-zptc-byelection-avinash-reddy-arrest/
అవినాష్ రెడ్డి అరెస్టును వైకాపా తీవ్రంగా ఖండించింది. ఎటువంటి నోటీసు లేకుండా అరెస్టు చేశారని, పోలీసులు తెదేపా అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. అవినాష్ రెడ్డి జ్వరంతో ఉన్నప్పటికీ, ఆయనను బలవంతంగా తీసుకెళ్లారని, కార్యకర్తలను కూడా దురుసుగా చూశారని వైసీపీ తెలిపింది. ఇదే సమయంలో, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సతీశ్ రెడ్డిని వేంపల్లిలో, టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని పులివెందులలో గృహనిర్బంధం చేశారు.
పులివెందుల జడ్పీటీసీ స్థానంలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వైసీపీ నేత హేమంత్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి మధ్య ప్రధాన పోటీ ఉంది. మొత్తం 10,600 మంది ఓటర్లు 15 పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేస్తున్నారు. ఒంటిమిట్టలో 24,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికలు వైసీపీ, టీడీపీ మధ్య ప్రతిష్టాత్మక పోరుగా మారాయి. వైఎస్ కుటుంబ బలమైన కంచుకోట అయిన పులివెందులలో టీడీపీ పాగా వేయాలని చూస్తోంది.
పోలీసులు 1,500 మంది బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు జడ్పీటీసీల సరిహద్దుల్లో, జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. వైసీపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి, ఎన్నికల్లో పారదర్శకత కోసం చర్యలు తీసుకోవాలని కోరింది.


