రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మంజూరు చేస్తున్న నిధులన్నీ దుర్వినియోగం అవుతున్నాయని ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం రుణాలు చేస్తూపోవడంపై బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఇటీవల చేసిన ఆరోపణలను వారు పునరుద్ఘాటించారు. ఈ విధమైన ఆరోపణలు చేసినందుకు పురంధేశ్వరిపై కొందరు వైసీపీ నాయకులు, ఒక మంత్రి విరుచుకుపడడాన్నివారు తీవ్రంగా ఖండించారు.
రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధులు జి. భానుప్రకాశ్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ తదితర నాయకులు మీడియాతో మాట్లాడుతూ, పురంధేశ్వరి చేసిన ఆరోపణల్లో అసత్యమేమీ లేదని, పూర్తి ఆధారాలతోనే ఆమె ఈ ఆరోపణలు చేశారని అన్నారు. నాలుగేళ్ల వై.ఎస్.ఆర్.సి.పి పాలనలో రుణ భారం పెరగడం, నిధులు దుర్వినియోగం కావడం తప్ప జరిగిందేమీ లేదని ఆ నాయకులు స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రుణ భారం రూ. 10.70 లక్షల కోట్లు దాటిపోయిన మాట నిజం కాదా అని వారు ప్రశ్నించారు. ఈ రుణాల మీద ప్రభుత్వం వెంటనే ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం ఇచ్చిన నిధులన్నీ దుర్వినియోగం అయ్యాయని వారు తీవ్రంగా ఆరోపించారు.
చివరికి పేదలకు ఉచితంగా పంచడానికి ఉద్దేశించిన బియ్యం కోసం, రైతులకు ప్రోత్సాహకాల కోసం, గ్రామీణ ఉపాధి కోసం కేంద్రం ఇచ్చిన నిధులను కూడా దుర్వినియోగమయ్యాయని వారు పేర్కొన్నారు. రాష్ట్ర రుణ భారానికి సంబంధించి పురంధేశ్వరి చేసిన ఆరోపణలను మంత్రులు ఆర్.కె. రోజా, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఇతరులు భరించలేకపోతున్నారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించినా వారు జీర్ణించుకోలేకపోతున్నారని రాష్ట్ర బీజేపీ నాయకులు వ్యాఖ్యానించారు. కేంద్రం ఇచ్చిన నిధులన్నిటినీ దారి మళ్లిస్తున్నారని, ఇందులో ఆవగింజంతయినా అబద్ధం లేదని వారు పేర్కొన్నారు. వాస్తవాలు వెల్లడించినందుకు పురందేశ్వరిపై విమర్శలు చేయడాన్ని వారు గట్టిగా ఖండించారు.