Raghunandanrao: హైదరాబాద్: మెదక్ ఎంపీ రఘునందన్‌రావు రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్‌కు ఎన్నికల వ్యవస్థపై నమ్మకం లేకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాహుల్ రాయ్‌బరేలి ఎంపీ స్థానానికి రాజీనామా చేస్తే బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తామని సవాల్ విసిరారు.
ALSO READ: BSF Recruitment : BSFలో 3,829 కానిస్టేబుల్ ఉద్యోగాలు..
రఘునందన్‌రావు మాట్లాడుతూ, ఈవీఎంలను రాజీవ్ గాంధీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, కానీ కాంగ్రెస్ నేతలు ఓడిపోతే ఈవీఎంలపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు సరిగ్గా పనిచేశాయని, బిహార్‌లో ఓడిపోతే మాత్రం ఈవీఎంలు తప్పని వారు విమర్శిస్తున్నారని విమర్శించారు. రాయ్‌బరేలిలో రాహుల్ గాంధీ గెలుపు వెనుక దొంగ ఓట్లు ఉన్నాయని, ఆ ఎన్నికను రద్దు చేయాలని కోరబోతున్నట్లు ఆయన తెలిపారు.
అలాగే, బెంగాల్‌లోని డైమండ్ హార్బర్, యూపీలో డింపుల్ యాదవ్ నియోజకవర్గాలపై కూడా అనుమానాలున్నాయని రఘునందన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని, న్యాయవ్యవస్థను గౌరవించడం లేదని, శాస్త్రీయంగా ఈవీఎంలపై అధ్యయనం చేయాలని సూచించారు. బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద గోడ కట్టాలన్న భాజపా ప్రతిపాదనను మమతా బెనర్జీ తిరస్కరించడంతో చొరబాటుదారుల సమస్య తీవ్రమవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించాలని రఘునందన్ డిమాండ్ చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగితే కేసీఆర్ ఎలా ఓడిపోయారని ప్రశ్నించారు. కోర్టు తీర్పులపై కేటీఆర్ వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుబట్టారు.


