ఇంతవరకు కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న భారతీయ జనతాపార్టీ ఇంకా 11 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. పేరుకు అది కేంద్రంలో అధికారంలో ఉన్న ఘనమైన పార్టీ. తెలంగాణ రాష్ట్రంలోనూ అధికారం చేపడతామని చెప్పుకుంటున్న పార్టీ. అంటే ఎంతో బలంగా జవసత్వాలతో ఉందనుకుంటారెవరైనా. కింది నుంచి పైదాకా పార్టీ కార్యకర్తలతో, నేతలతో ప్రబలశక్తిగా ఉందని భావిస్తారు. కానీ పరిస్థితి అందుకు పూర్తి రివర్స్. కార్యకర్తలు, అగ్రనేతల సంగతటుంచి కనీసం పోటీ చేసేందుకు తగిన అభ్యర్థులను ఎంపిక చేయలేదంటే అంతోటి పార్టీ ఘనత ఎంతోటో ఎవరైనా అంచనా అర్థం చేసుకోవచ్చు. దీనికంటే కాంగ్రెస్ కాస్త నయం. దాంట్లోనూ ఇంకా ఐదు స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి.
విన్నర్ బీఆర్‌ఎస్
రన్నింగ్ రేసులోనైనా పొలిటికల్ వార్‌లోనైనా ముందు వెళ్లేవారే విన్నర్ అవుతారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ రెండున్నర నెలల ముందే అభ్యర్థులను ప్రకటించి, బీఆపారాలను పంపిణీ చేసి ప్రచారంలోనూ ఊరూవాడా చుట్టేస్తూ సుడిగాలిని తలపిస్తుండగా, జాతీయపార్టీలని చెప్పుకుంటున్న బీజేపీ,కాంగ్రెస్‌లు అభ్యర్థులను ఎంపిక చేయడానికే నానా తంటాలు పడుతున్నాయి. మూడు నాలుగేసి తడవలుగా ప్రకటించాల్సిన పరిస్థితితోపాటు అన్ని స్థానాలకూ ఇంకా అభ్యర్థులను వెల్లడించని దుస్థితి. రెండూ వేటికవిగా తమంత తాము పోటీ చేయలేక పొత్తులకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ సీపీఎంతో, బీజేపీ జనసేనతో పొత్తులు కుదుర్చుకున్నాయి. కాంగ్రెస్ ఇతర పార్టీల మద్దతునూ పొందింది. అయినా ఇంకా ఐదుగురు అభ్యర్థులను తేల్చలేదు.
బలుపో.. వాపో ?
ఇక బీజేపీ తనకుతాను ఎంత గొప్పగా చెప్పుకున్నా అన్ని సీట్లకూ అభ్యర్థులే దొరకని దాని పరిస్థితి చూస్తే బలుపో వాపో అర్థమవుతుంది. చివరకు జనసేన అనే పార్టీతో పొత్తు చేసుకున్నా రెండూ కలిసి కూడా మొత్తం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఇందులో జనసేన ఎనిమిది సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా ఇంకా 11 పెండింగ్‌లో ఉన్నాయి. వాటిల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకొచ్చే శేరిలింగంపల్లి, మల్కాజిగిరి,మేడ్చల్, కంటోన్మెంట్, నాంపల్లి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. వీటిల్లో శేరిలింగంపల్లి ఓటర్లు రాష్ట్రంలోనే అత్యధికం. అంతటి కీలకమైన నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు అభ్యర్థిని ఎంపిక చేయలేకపోయిన బీజేపీ–జనసేనల శక్తిసామర్ద్యాలేమిటో తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ సైతం పాతబస్తీకి తలమానికమైన చార్మినార్ సెగ్మెంట్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా మరోమూడు సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇప్పటికే ప్రకటించిన పటాన్‌చెరు నియోజకవర్గం అభ్యర్థికి బీ ఫారం ఇవ్వలేదు. ఈ రెండు పార్టీలు ఇలా అభ్యర్థులకు టిక్కెట్లు, బీఫారాలు ఇచ్చేందుకే ఇంత తిప్పలు పడుతుంటే, ఎలా గెలుస్తాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. టిక్కెట్లు, అభ్యర్థులపైనే స్థిరత్వం లేని పార్టీలు ఎలాగూ అధికారంలోకి రావు. పొరపాటున వచ్చినా పాలనా అస్థిరంగానే ఉంటుందని చెబుతున్నారు.