Marri Shashidhar Reddy : సీనియర్ రాజకీయ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, సోనోవాల్, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ నాయకులు కాషాయ కండువా కప్పి సాదరంగా ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదన్నారు. ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని, టీఆర్ఎస్‌ను గద్దె దించేదాక తన పోరాటం ఆగదని అన్నారు.
మర్రి శశిధర్‌రెడ్డి బీజేపీలో చేరడంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు. కుటుంబ పాలన అంతం కావాల్సిన ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి మర్రి శశిధర్ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తాను కాంగ్రెస్ వీడేందుకు గల కారణాలను తెలుపుతూ సోనియా గాంధీకి లేఖ రాశారు. రాష్ట్ర కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలే తనను పార్టీ వీడేలా చేశాయని మర్రి చెప్పారు.