వేములవాడ బి.ఆర్.ఎస్ పార్టీలో జరుగుతున్న అనూహ్య సంఘటనల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. 7వ తేదీన జరిగిన వైస్ చైర్మన్ ఎన్నికలో పార్టీ ఆదేశాలను ధిక్కరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారనే కారణంతో పార్టీకి చెందిన అయిదుగురు కౌన్సిలర్లను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య శనివారం ప్రకటన విడుదల చేశాడు. అయితే ప్రకటన విడుదలైన కొన్ని గంటల వ్యవధిలోనే సస్పెండైన కౌన్సిలర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారి వాదనలు వినిపించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైనట్లు తెలుస్తోంది. సస్పెండైన అయిదుగురిలో కేవలం ముగ్గురు మాత్రమే మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ పరిణామం కొత్త చర్చకు దారి తీసింది. హాజరు కాని మిగతా ఇద్దరి విషయంలో పార్టీ ‘యూ టర్న్ తీసుకున్నట్లు, అందుకే వారివురు సమావేశంలో పాల్గొనలేదనే వాదనలు వినిపించాయి. అయితే అందరూ ఊహించనట్లుగానే ఇద్దరి విషయంలో కాదు గానీ 2వ వార్డ్ కౌన్సిలర్ రెండుమిద్దల జయ-సలీమ్ విషయంలో మాత్రం పార్టీ కంప్లీట్ ‘యూ’ టర్న్ తీసుకున్నట్లు తెలిసింది. వీరి విషయంలో అధిష్టానం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.
ఉద్యమకారుడిగా గుర్తింపు
వాస్తవానికి సస్పెండైన అందరి కౌన్సిలర్లతో పోలిస్తే జయ-సలీమ్ ల రాజకీయ చరిత్ర వేరు… 2001 పార్టీ ఆవిర్భావం నుండి ఉద్యమకారుడిగా, పార్టీకి విధేయుడిగా సలీమ్ కొనసాగుతున్నాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైన, ఎన్నెన్నో ఆర్థిక ఇబ్బందులు సవాళ్లు విసిరినా, ఎత్తిన జెండా దించలేదు, ఎవరెన్ని ఆశలు చూపినా కప్పుకున్న కండువాను మార్చలేదు. ఇలా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి గత 23 ఏండ్లుగా సలీమ్ పార్టీలో కొనసాగుతున్నాడు. అలాంటి వ్యక్తిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఒక్కసారిగా ప్రకటన రావడంతో వేములవాడ ప్రజలతో పాటు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు అవాక్కయ్యారు.
మంతనాలు జరిపిన జిల్లా అధ్యక్షుడు
సలీమ్ సస్పెన్షన్ విషయంలో జరుగుతున్న చర్చ ఆనోటా..ఈ నోటా… పార్టీ అదిష్టానం దృష్టికి వెళ్ళింది. దీంతో ఒక నిఖార్సయిన ఉద్యమకారుడిని, పార్టీ అభ్యున్నతి కొరకు అంకిత భావంతో పనిచేసే వ్యక్తిని, ఎవరో చెప్పిన మాటలు విని దూరం చేసుకుంటే పార్టీకి భారీ నష్టం జరుగుతుందని, ఇది త్వరలో జరగబోయే ఎంపీ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని పార్టీ అదిష్టానం గ్రహించినట్లుంది. వెంటనే సలీమ్ ను లైన్లో పెట్టె పనిలో పడింది. అనుకున్నదే తడవుగా ఎవరైతే ప్రకటన విడుదల చేశారో మళ్ళీ అదే వ్యక్తిని సలీమ్ తో మంతనాలు జరపాలని, దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు, పార్టీ అదిష్టానం ఆదేశాల మేరకు తోట ఆగయ్య సలీమ్ తో ఇప్పటికే మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.
పార్టీని వీడేది లేదు, జెండా దించేది లేదు, పరాయి పార్టీకి వెళ్ళేది లేదు
మరోవైపు ఈ అన్ని పరిణామాలపై సలీమ్ స్పందించాడు. 2001 నుండి ఇప్పటివరకు రెండు దశాబ్దాలకు పైగా పార్టీ అభ్యున్నతి కొరకు, అధినేత కేసీఆర్ పై అభిమానంతో, ఆయన అడుగుజాడల్లో గులాబీ జెండా నీడన పని చేస్తున్నాను. అలాంటి నన్ను సస్పెండ్ చేస్తే ఊరుకునేది లేదు. ఎవరేం చేసిన పార్టీని, పార్టీ జెండాను వీడేది లేదు, పరాయి పార్టీ జెండా పట్టేది లేదు. జీవితం మొత్తం గులాబీ పార్టీకి, గులాబీ జెండాకే అంకితం. పార్టీకి సంబంధించిన కీలక నేత తనతో మంతనాలు జరిపిన మాట వాస్తవమే. ఇంకా వారికి ఎలాంటి హామీ ఇవ్వలేదని ఆయన తేల్చిచెప్పటం కొసమెరుపు.