Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Gummanuru: గుమ్మనూరు ప్రభావం సాయిపై పడేనా?

Gummanuru: గుమ్మనూరు ప్రభావం సాయిపై పడేనా?

గతంలో టీడీపీ అంటే వాల్మీకి, వాల్మీకి అంటే టీడీపీ

కార్మిక శాఖ మంత్రి, ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్లు ప్రసార మాధ్యమాలలో చక్కర్లు కొడుతుంది. ఇదే నిజమైతే గుమ్మనూర్ జయరాం ప్రభావం మంత్రాలయం, ఆదోని, గుంతకల్ నియోజక వర్గంపై పడనుందా? ఆలూరు ఎమ్మెల్యే సీట్ రాకపోవడానికి రాంపురం సోదరులే ప్రధాన కారణంచే తనకు లభించ లేదని, కనుక ఆ ముగ్గరిని 2024 ఎన్నికల్లో ఒడిస్తానని ప్రతిన బూనినట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదే నిజమైతే ఆదోని నియోజక వర్గం వైసీపీకి గట్టి దెబ్బ తప్పదేమో?

- Advertisement -

సాయిప్రసాద్ ఎంట్రీతో..

ఆదోనికి 30 కిలోమీటర్ల దూరంలో ఆలూరు నియోజక వర్గంలో గుమ్మనూర్ తిష్ట వేసి కార్యకలాపాలు నడిపిస్తున్న విషయం అందరికి విదితమే. దీంతో ఆదోని ప్రజలతో ముఖ్యంగా తన సామాజిక వర్గం అయిన బోయలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆదోనిలో బోయ సామాజిక వర్గంకు చెందిన ఓటర్లే దాదాపు 50 వేల దాకా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో బోయలు అంటే తెలుగు దేశం, తెలుగు దేశం అంటే బోయలు అన్న చందంగా ఉండేది. తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడుకు బోయ సామాజిక వర్గం అండగా ఉండేది. క్రమేణా సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాక బోయ సామాజిక వర్గంపై కన్నేసి చాలా మంది ముఖ్యులను తన పార్టీలో చేర్చుకునేలా సఫలీకృతులై, టీడీపీకి గట్టి షాక్ ఇచ్చాడు. టీడీపీ ఇంఛార్జి మీనాక్షి నాయుడు కూడా కొందరు వాల్మీకిలు వైసీపీలో చేరుతున్నా నిలువరించకుండా కేవలం పనుల నిమిత్తం ఆ పార్టీలో చేరారని, మరల ఎన్నికల తరుణంలో తిరిగి వస్తారని అనుకున్నారు. కానీ మీనాక్షి నాయుడు అనుకున్నట్లు జరగలేదు. అయినప్పటికీ మీనాక్షి నాయుడు అంటే ఎనలేని అభిమానం వాల్మీకి మనసులో ఉన్నట్లు సమాచారం.

ఛాలెంజ్ గా తీసుకున్నారా?

ఆదోని నియోజక వర్గంలో గెలుపోటములకు ప్రధానంగా వాల్మీకి, ముస్లిం, స్వకుల సాలే, కురువలపై ఆధారపడి ఉందనేది నగ్న సత్యం. గుమ్మనూర్ జయరాం దీన్ని సవాలుగా తీసుకొని ఉండవచ్చు అనేది ప్రజల అభిప్రాయం. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం, ఆదోనిలో వైసీపీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ వాల్మీకి కుటుంబంలో తలెత్తే సమస్యలకు గుమ్మానూర్ దగ్గరికి వెళ్లేవారని చర్చించుకుంటున్నారు. కార్మిక శాఖ మంత్రి గుమ్మనూర్ జయరాం ఒక వేళ టిడిపిలో చేరి, సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతున్న మాట నిజమైతే ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిపై వాల్మీకి ప్రభావం పడే అవకాశాలు ఉంటాయని చెపుతున్నారు. టీడీపీ హయాంలో ప్రస్తుత టీడీపీ జిల్లా అధ్యక్షుడు బిటి నాయుడుకు, గుడిసె కృష్ణమ్మ ఎమ్మెల్సీ పదవులు పొందగా, వైసీపీ ప్రభుత్వంలో డాక్టర్ మధుసూధన్ ఎమ్మెల్సీ గా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వాల్మీకులకు ఎమ్మెల్సీ, మునిసిపల్ చైర్మన్ పదవి కట్టబెట్టిన సముచిత గౌరవం లేక, ఏమనలేక మౌనంగా ఉన్నారని వాల్మీకి సోదరులు మాట్లాడుకుంటున్నారు. ఎమ్మెల్యే ఒకే సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తున్నారని, వారికి లభిస్తున్న గౌరవం తమకు లభించడం లేదంటున్నారు. ఇటీవలే వాల్మీకులకు చట్ట సభల్లో సముచిత స్థానం లభించడం లేదని పెద్ద హరివానం నుండి ఆదోని సబ్ కలెక్టర్ వరకు పాదయాత్ర చేబట్టారు. ఈ అలుసు తీసుకొని ఆదోని నియోజక వర్గ వాల్మీకులు మంత్రి గుమ్మనూర్ తో చేతులు కలిపి వైసీపీని దెబ్బతీస్తారా.. గుమ్మనూర్ సఫలీకృతుడు అవుతాడా అనేది వేచి చూడాలి.

గందరగోళంలో ప్రజలు

ఎన్నో ఏళ్ళు గా నియోజక వర్గాల పోరు ఉండేది, ఎవరిది వారు చూసుకునేవారు. మంత్రి గుమ్మనూర్ వ్యాఖ్యలతో ఇతర నియోజక వర్గాల గెలుపు ఓటములపై కన్నేయడం చూస్తే రానున్న రోజుల్లో ఎటు వైపు వెళుతుందో రాజకీయం చూడాలి. కానీ ప్రస్తుతం రాజకీయం రోజూ, గంటగంటకు మారుతుండటం విశేషం. వైసిపిని వీడిన ఆర్కే మరల గూటికి రావడం లాంటివి చూస్తుంటే ఏది నిజమో..ఏది అబద్దమో అర్థమే కావడం లేదని, నాయకులు నిలకడ లేని మాటలు మాట్లాడుతూ, ప్రజలను గందరగోళంలో నెట్టేస్తున్నారు. ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి గతంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు గుమ్మానూర్ తో నాకు మంచి సంబంధాలున్నాయని, ఆయనకు టికెట్ రాకుండా నేనెలా అడ్డుపతానని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాత్రం ఆదోనిలో మరోమారు జెండా ఎగుర వేస్తానని దృఢ సంకల్పంతో ఉన్నారు. మరో రెండు నెలల్లో జరిగే ఎన్నికల్లో వాల్మీకులు ఎటువైపు మొగ్గు చూపుతారో, గెలుపోటములపై ఎవరి ప్రభావం పడుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News