శాసనసభ, మండలి సభ్యులు పాల్గొన్న సాంస్కృతిక కార్యక్రమాల్లో హాస్యం కాస్తా అపహాస్యం అయ్యిందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి (Satish Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్ కడప జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షనేత వైయస్ జగన్‌పై కొందరు చేసిన నీచమైన అనుకరణలను చూసి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు(Chandra Babu) వికృతానందం పొందారని మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు ఒక హుందాతో కూడిన ప్రవర్తనతో అందరికీ ఆదర్శంగా ఉండాల్సింది పోయి అసహ్యాన్ని కలిగించేలా వ్యవహరించిన తీరును ప్రజలు గమనిస్తున్నారనే స్పృహ కూడా కూటమి నేతలకు లేకపోవడం దారుణమని అన్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కడైనా అహ్లాదాన్ని పంచుతాయి. కానీ ప్రజాప్రతినిధులు పాల్గొన్న కార్యక్రమం దానికి భిన్నంగా నిర్వహించారు. కొందరు సభ్యులు హద్దుమీరి చేస్తున్న అపహాస్యపు చేష్టలపై సుదీర్ఘ రాజకీయ జీవితం అని చెప్పుకునే చంద్రబాబు వారిని నియంత్రించడంలో విఫలమయ్యారు. పైగా ఆ వికృత చేష్టలను చూసి ఆయన సంతోషంతో తబ్బిబ్బయ్యారు. ప్రజాజీవితంలో ఉన్నవారు అందరికీ ఆదర్శంగా ఉండాలంటూ, ప్రసంగాల్లోనూ సభ్యతతో మాట్లాలంటూ నీతులు చెప్పడం కాదు, దానిని ఆచరించాలని, తోటి వారు ఏదైనా సందర్భంలో హద్దుమీరుతుంటే వారిని నియంత్రించాలనే విషయం చంద్రబాబు మరిచిపోయారా? వైయస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా కొందరు సభ్యులు వ్యవహరించిన తీరు చాలా బాధాకంగా ఉంది. వైయస్‌ఆర్‌సీపీకి కేవలం 11 అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చాయంటూ ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి కేవలం 23 సీట్లు వస్తే, జనసేన కనీసం ఒక్కసీటు కూడా గెలవలేక పోయిందనే విషయం మరిచిపోయారు.
అరాచక శక్తులకు చంద్రబాబు అండ
ప్రతిపక్ష పార్టీపై బూతులతో విరుచుకుపడే వారికి చంద్రబాబు నుంచి ప్రసంశలు వస్తున్నాయి. వైసీపీపై తిట్లతో దుమ్మెత్తి పోసేవారికి పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. నిద్ర లేచింది మొదలు వైయస్సార్సీపీ నాయకుల దౌర్జన్యం, అవినీతి అక్రమాలు అని చంద్రబాబు మాట్లాడుతుంటాడు. హత్య అనే సినిమాలో ఉన్న కొన్ని సీన్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఈరోజు ఉదయం 3 గంటలకు పులివెందుల నియోజకవర్గంలో పవన్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
వివేకానందరెడ్డి హత్య కేసులో ముద్దాయిగా ఉన్న సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేశామని చెబుతున్న పోలీసులు, సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన సినిమా క్లిప్పింగులు షేర్ చేయడం తప్పెలా అవుతుందో సమాధానం చెప్పాలి. హత్య కేసులో నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ ఫిర్యాదు చేస్తే అత్యంత వేగంగా స్పందించి అరెస్ట్ చేసిన పోలీసులు, వైసీపీ నాయకుల కుటుంబ సభ్యుల దారుణమైన పోస్టులు పెడుతున్నా పట్టించుకోవడం లేదు. దీన్నిబట్టి చూస్తుంటే ఈ ప్రభుత్వం వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల పక్షాన ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. టీడీపీ నాయకుల అండతో వివేకం అనే సినిమా తీసి వైయస్ జగన్, ఆయన కుటుంబాన్ని దారుణంగా కించపరిచినా ఈ పోలీసులు పట్టించుకోలేదు.