టీమిండియా మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. రాజ్ కోట్ వేదికగా ఐర్లాండ్ తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో భారత మహిళలు బ్యాటింగ్ లో విజృంభించారు. వరుసగా మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో.. వన్డే చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేశారు. ఓపెనర్లు స్మృతి మంధాన 80 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సులతో 135 పరుగులు చేసింది. ప్రతీక్ రావల్ 129 బంతుల్లో 20 ఫోర్లు, ఒ సిక్స్ సాయంతో 154 పరుగులు చేసింది. భారీ సెంచరీలు కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 435 పరుగుల భారీ స్కోర్ చేసింది.
వన్డేల్లో భారత మహిళలకు ఇదే అత్యధిక స్కోరు. అంతకముందు ఇదే సిరీస్ లో రెండో వన్డేలో 370 పరుగులు చేసిన రికార్డును ఆ తర్వాత మ్యాచ్ లోనే బ్రేక్ చేయడం విశేషం. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ను ఆరంభం నుంచి ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీక్ రావల్ ధాటిగా ఆడారు. కుదురుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోకుండా బౌండరీల వర్షం కురిపించారు. ముఖ్యంగా స్మృతి తనదిన శైలిలో హిట్టింగ్ చేస్తూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లింది. తొలి వికెట్ కు 26 ఓవర్లలోనే ఈ జోడీ 233 పరుగులు జోడించడం విశేషం.
70 బంతుల్లో సెంచరీ చేసిన స్మృతి మందాన భారత మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేసింది. సెంచరీ తర్వాత ఔటైనా.. రిచా ఘోష్ (59) తో ప్రతీక్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపింది. ఈ క్రమంలో ప్రతీక్ కెరీర్ లో తొలి సెంచరీ పూర్తి చేసుకోగా.. మరో ఎండ్ లో రిచా వేగంగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటైనప్పటికీ అప్పటికే భారత్ భారీ స్కోర్ చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో ఓర్లా ప్రెండర్గాస్ట్ రెండు వికెట్లు తీసుకుంది.