Anderson-Tendulkar Trophy Inauguration: రేపు(శుక్రవారం) నుంచి భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మకమైన టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. జూన్ 20 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు ఇరు జట్ల మధ్య ఐదు టెస్టులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌కు అధికారికంగా “అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ” అని పేరు పెట్టారు. ఇందుకు సంబంధించిన ట్రోఫీని ఇరు జట్ల దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, జేమ్స్ అండర్సన్ ఆవిష్కరించారు. ట్రోఫీ ఆవిష్కరించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా తనకు దక్కిన గౌరవంపై సచిన్ ఎమోషనల్‌గా స్పందించారు. బీసీసీఐ, ఇంగ్లాండ్ బోర్డులు ఈ ట్రోఫీ పటౌడీ పేరు బదులు అండర్స్-టెండూల్కర్ పేరు పెడతామని విషయం తనకు తెలిసిన వెంటనే పటౌడీ కుటుంబానికి ఫోన్ చేసి మాట్లాడానని తెలిపారు. వారి వారసత్వానికి ఎలాంటి లోటు రాకుండా చూస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈమేరకు సిరీస్ గెలిచిన జట్టు కెప్టెన్‌కు పటౌడీ మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు అందజేయాలని ఇరు జట్లు బోర్డులు నిర్ణయించాయి.
ఇదిలా ఉంటే ఈ టెస్టు సిరీస్ సందర్భంగా భారత యువ జట్టుకు సచిన్ తన విలువైన సూచనలు చేశారు. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ అత్యంత కీలకమని సూచించారు. ముఖ్యంగా ఇంగ్గాండ్‌లోని చల్లటి వాతావరణంలో బంతిని గ్రిప్ చేయడం కష్టమని.. మ్యాచ్ విన్నింగ్‌గా భావించే క్యాచ్‌లు వదలకుండా చూసుకోవాలన్నారు. ఈ విషయంలో యువ ఆటగాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ నేపథ్యంలో ఈ సిరీస్ టీమిండియాకు సవాలుగా మారనుంది. రోహిత్, కోహ్లీ స్థానాల్లో ఎవరిని ఆడించాలనే దానిపై ఇప్పటికీ టీమ్ మేనేజ్మెంట్ స్పష్టతకు రాలేదు. అయితే నాలుగో స్థానంలో కెప్టెన్ గిల్, ఐదో స్థానంలో తాను బ్యాటింగ్‌కు వస్తానని రిషభ్ పంత్ ప్రకటించాడు. ఓవైపు టీమిండియా తుది జట్టు ఎంపికపై తీవ్రంగా ఆలోచిస్తుంటే.. ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు మాత్రం తొలి టెస్టును 11 మంది ఆటగాళ్లను కూడా ప్రకటించింది.


