విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నీలో(Vijay Hazare Trophy) పంజాబ్ బ్యాటర్ అన్మోల్‌ప్రీత్ సింగ్(Anmolpreet Singh) రెచ్చిపోయాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్మోల్‌ప్రీత్ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. మొత్తం 45 బంతులాడి 115 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 9 సిక్స్‌లు ఉన్నాయి.
దీంతో లిస్ట్ ఏ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు భారత మాజీ బ్యాటర్ యూసుఫ్ పఠాన్(40 బంతుల్లో) పేరిట ఉండేది. ఓవరాల్‌గా జేక్ ఫ్రేజర్ (29 బంతుల్లో), ఏబీ డివిలియర్స్ (31 బంతుల్లో) అన్మోల్ కంటే ముందున్నారు.
ఇక ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్48.4 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. పంజాబ్ బౌలర్లలో అశ్వని కుమార్ 3, మయాంక్ మార్కండే 3, బల్తేజ్ సింగ్ 2 వికెట్లు తీశారు. అనంతరం బరిలోకి దిగిన పంజాబ్ కేవలం 12.5 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.