ఐపీఎల్ తరహాలో ఉమెన్ ప్రీమియర్ లీగ్(WPL 2025) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. తాజా సీజన్‌కు సంబంధించి యూపీ వారియర్స్ జట్టు కీలక ప్రకటన చేసింది. భారత ఆల్ రౌండర్ దీప్తి శర్మ (Deepti Sharma)ను కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు తెలిపింది. రెగ్యులర్ కెప్టెన్ అలీసా హీలీ గాయపడటంతో ఆమె స్థానంలో నాయకత్వ బాధ్యతలను దీప్తి శర్మకు అప్పగించింది. గతేడాది దీప్తి ఆ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహారించింది.
అలాగే యూపీ వారియర్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ దీప్తి శర్మ కావడం గమనార్హం. మొత్తం 295 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ 10 వికెట్లు తీసింది.
ఇదిలా ఉంటే డబ్ల్యూపీఎల్‌లో ఓ జట్టుకు సారథిగా బాధ్యతలు చేపట్టబోయే మూడో భారత క్రికెటర్‌గా దీప్తి నిలిచింది. స్మృతి మంధాన (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), హర్మన్ ప్రీత్ కౌర్ (ముంబయి ఇండియన్స్) ఇప్పటికే కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.