మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఇక అహ్మదాబాద్ వేదికగా బుధవారం మూడో వన్డే(Ind Vs Eng 3rd Odi) జరగనుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ చైర్మన్ జై షా(Jay Shah) కీలక ప్రకటన చేశారు. ఈ మ్యాచ్‌లో అవయవదానాన్ని ప్రోత్సహించడానికి ఓ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ‘అవయవ దానం చేయండి.. ప్రాణాలను కాపాడండి’ అనే థీమ్‌తో వస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
“ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లో భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో వన్డే జరగనున్న సందర్భంగా ‘అవయవ దానం చేయండి.. ప్రాణాలను కాపాడండి’ అనే అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించడం గర్వకారణంగా ఉంది. ప్రజలకు స్ఫూర్తిని ఇచ్చి వారిని ఏకం చేసే శక్తి క్రీడలకు మాత్రమే ఉంది. అందుకే అవయవ దానం విషయంలో ముందడుగు వేసి ప్రజలను చైతన్యపరచాలనుకుంటున్నాం. ప్రపంచంలో ఇతరులకు ఇచ్చే గొప్ప బహుమతి జీవితాన్ని ఇవ్వడం మాత్రమే. ఒక మంచి నిర్ణయం ఇతరుల జీవితాలను కాపాడుతుంది” అని పేర్కొన్నారు.