India vs Bangladesh: ఇండియా–బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 271 పరుగులు చేసింది. బంగ్లా జట్టులో మెహిది హసన్ మిరాజ్ సెంచరీతో నాటౌట్‌గా నిలిచాడు. చివరి బంతికి సెంచరీ సాధించి బంగ్లాదేశ్ గౌరవ ప్రదమైన స్కోరు సాధించడంలో మెహిది హసన్ కీలక పాత్ర పోషించాడు.
మరో ఆటగాడు మహ్ముదుల్లా 96 బంతుల్లో 77 పరుగులు సాధించి జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన బంగ్లాను మెహిది హసన్, మహ్మదుల్లా ఆదుకున్నారు. బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ఒక దశలో బంగ్లాదేశ్ 100 పరుగులకే ఆలౌట్ అవుతుందేమో అనిపించింది. అయితే మెహిది హసన్, మహ్మదుల్లా కలిపి 147 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 217 పరుగుల వద్ద వీరి భాగస్వామ్యానికి తెరపడింది.
77 పరుగులు చేసిన మహ్మదుల్లా , ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన నసుమ్ అహ్మద్ సహకారంతో మెహిది చెలరేగాడు. చివర్లో ధాటిగా ఆడుతూ బంగ్లాదేశ్ మంచి స్కోరు సాధించడంలో తోడ్పడ్డాడు. చివరి బంతికి మెహిది సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. ఓపెనర్లు త్వరగా ఔటైనా.. బంగ్లా భారత్ ముందు మంచి లక్ష్యాన్నే ఉంచగలిగింది.
బంగ్లా బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్లు అనాముల్ హకి 11 పరుగులు, లిటన్ దాస్ 7 పరుగులు, నజ్ముల్ హొసైన్ 21 పరుగులు, షకీబ్ అల్ హసన్ 8 పరుగులు, ముస్తాఫికర్ రహిమ్ 12 పరుగులు చేయగా, అఫిఫ్ హొసేన్ డకౌట్ అయ్యాడు. భారత బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు, ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు తీశారు.