PAK vs ENG : ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉంది. 17 ఏళ్ల తరువాత పాకిస్థాన్ గడ్డపై ఆ దేశంతో టెస్టు సిరీస్ ఆడనుంది. అయితే.. సిరీస్ ఆరంభానికి ముందే ఇంగ్లాండ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ బెన్‌స్టోక్స్‌తో సహా 14 మంది ఆటగాళ్లకు గుర్తు తెలియని వైరస్ సోకడంతో తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. జో రూట్, జాక్ క్రాలే, హ్యారీ బ్రూక్, ఒల్లీ పోప్, కీటన్ జెన్నింగ్స్ లు మినహా మిగిలిన వారు అస్వస్థతకు గురైయ్యారు.
దీంతో డిసెంబర్ 1(గురువారం) నుంచి ప్రారంభం అయ్యే తొలి టెస్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే.. ఇంత వరకు పీసీబీ, ఈసీబీలు మ్యాచ్ నిర్వహణపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. మ్యాచ్ సమయానికల్లా ఆటగాళ్లు కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆటగాళ్ల రిపోర్టులు వస్తే గానీ అసలు విషయం ఏమిటీ అన్న సంగతి తెలియదు. అయితే అది కరోనా వైరస్ మాత్రం కాదని వైద్యులు చెప్పారు.
టీ20 ప్రపంచకప్ కు ముందు పాకిస్థాన్‌లో పర్యటించిన ఇంగ్లాండ్ 7 మ్యాచుల టీ20ల సిరీస్‌ను 4-3 గెలిచింది. అనంతరం ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లింది. పొట్టి ప్రపంచకప్ తరువాత మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు మళ్లీ పాక్‌కు వెళ్లింది. షెడ్యూల్ ప్రకారం రావల్పిండి వేదికగా డిసెంబర్ 1 నుంచి తొలి టెస్టు మ్యాచ్ ఆరంభంకానుంది. డిసెంబర్ 9న ముల్తాన్‌లో రెండో టెస్టు, డిసెంబర్ 17న కరాచీలో జరనున్నాయి.