Monday, June 16, 2025
HomeఆటWTC 2025-27: డబ్ల్యూటీసీ 2025-27 షెడ్యూల్ విడుదల

WTC 2025-27: డబ్ల్యూటీసీ 2025-27 షెడ్యూల్ విడుదల

WTC 2025-27 Schedule: లార్డ్స్ వేదికగా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25 ఫైనల్ మ్యాచ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన సౌతాఫ్రికా 27 ఏళ్ల తర్వాత విశ్వవిజేతగా నిలిచింది. ఈ సీజన్ ముగిసిందో లేదో 2025-27 టెస్టు ఛాంపియన్ షిప్ షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఈ సీజన్ లో మొత్తం 71 టెస్టు మ్యాచులు జరగనున్నాయి. జూన్ 17న శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో సీజన్ ప్రారంభమవుతుంది.

ఈ షెడ్యూల్ లో ఆస్ట్రేలియా జట్టు ఎక్కువగా 22 టెస్టులు ఆడనుండగా.. ఇంగ్లాండ్ జట్టు 21 టెస్టులు ఆడనుంది. ఇక టీమిండియా 18 టెస్టులు ఆడనుంది. న్యూజిలాండ్ 16 టెస్టులు, వెస్టిండీస్ 14 టెస్టులు, దక్షిణాఫ్రికా 14 టెస్టులు, పాకిస్తాన్ 13 టెస్టులు, శ్రీలంక 12 టెస్టులు, బంగ్లాదేశ్ 12 టెస్టులు ఆడనున్నాయి.

ఈ సీజన్ ను జూన్ 20న ఇంగ్లాండ్ తో జరగనున్న టెస్టుతో భారత జట్టు ప్రారంభించనుంది. 18 టెస్టుల్లో ఇంగ్లాండ్‌తో 5 టెస్టులు, వెస్టిండీస్‌తో 2 టెస్టులు, దక్షిణాఫ్రికాతో 2 టెస్టులు, ఆస్ట్రేలియాతో 5 టెస్టులు, శ్రీలంకతో 2 టెస్టులు, న్యూజిలాండ్‌తో 2 టెస్టులు గిల్ సేన ఆడనుంది. ఇందులో ఎక్కువ మ్యాచులు స్వదేశంలో జరగనుండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం.

2019-21 డబ్ల్యూటీసీ సైకిల్ లో అత్యధిక విజయాలతో భారత జట్టు ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఓడిపోయింది. అనంతరం 2021-23 సీజన్ లోనూ అద్భుతంగా ఆడి మరోసారి ఫైనల్ చేరుకుంది. అయితే ఈసారి కూడా ప్రత్యర్థి జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయి రెండోసారి కూడా ట్రోఫీ గెలుచుకునే అవకాశం కోల్పోయింది. ఇక 2023-25 సీజన్ లో మాత్రం కొన్ని పరాజయాలతో మూడో స్థానంలో నిలిచింది.

అయితే ఈసారి ఆడనున్న 18 టెస్టుల్లో ఎక్కువ మ్యచ్ లు సొంతగడ్డపై ఆడనుండటం టీమిండియా విజయాల శాతం పెరగడానికి అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ సీజన్ ను భారత జట్టు యువ ఆటగాళ్లతో ఆడనుంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో యువ ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కింది. శుభమన్ గిల్ ఈ జట్టుకు సారథ్యం వహిస్తుండగా.. రిషభ్ పంత్ వైస్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News