భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టు సిడ్నీ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా టాపార్టర్ కథ మారలేదు. తొలి ఇన్నింగ్స్ లో సీనియర్లు హ్యాండ్ ఇవ్వడంతో.. 185 పరుగులకే కుప్పకూలిన భారత్ రెండో ఇన్నింగ్స్ లో కూడా ఘోరంగా విఫలమయ్యింది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా విరాట్ కోహ్లీ దారుణంగా ఆడుతున్నాడు. సీనియర్ ప్లేయర్ విరాట్ సిడ్నీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. పోనీ రెండో ఇన్నింగ్స్ లో అయినా సత్తా చాటుతాడని ఆశగా ఎదురు చూసిన క్రీడాభిమానులకు నిరాశ మిగిలింది.
సిడ్నీ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ కోహ్లీ 6 పరుగులు చేసి వెనుదిరిగాడు. తన బలహీనత ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్‌ను కొనసాగిస్తూ బొలాండ్ బౌలింగ్‌లో స్లిప్‌లో స్టీవ్ స్మిత్ చేతికి చిక్కాడు. విరాట్ 2024 జనవరి 3 నుంచి నేటి సిడ్నీ వరకు టెస్టు వరకు కేవలం రెండుసార్లు మాత్రం 50 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో మొత్తం తొమ్మిది ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేశాడు. ఇందులో ఏడుసార్లు అవుట్ అయ్యాడు. అయితే ఈ ఏడుసార్లు బంతి బ్యాట్ అంచును తాకి వికెట్ల వెనక్కి వెళ్లి కీపర్, స్లిప్ ఫిల్డర్ల చేతుల్లో పడింది. ఆస్ట్రేలియాపై ఓ సెంచరీ మినహా మిగిలిన అన్ని మ్యాచుల్లో విఫలం అయ్యాడు. ఈ సిరీస్‌లో విరాట్ స్కోర్లు.. 5, 100*, 7, 11, 3, 36, 5, 17, 6. పరుగులు చేశాడు. మొత్తం 9 ఇన్నింగ్స్‌ల్లో 23.75 సగటుతో 190 పరుగులు మాత్రమే చేశాడు.
ప్రస్తుతం రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ సైతం టెస్టుల్లో రిటైర్‌మెంట్ తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో జట్టు కోసం అంటూ రోహిత్ శర్మ సిడ్నీ టెస్టు నుంచి తప్పుకున్నాడు. అందేకాదు తన బ్యాటింగ్ బాగోలేదని.. ఫామ్ లో లేనని నిజాయితీగా చెప్పాడు. సిడ్నీలో రెండు ఇన్నింగ్సుల్లోనూ విరాట్ దారుణంగా విఫలం అవడంతో.. అందరి దృష్టి కోహ్లీపైనే పడింది. కీలక మ్యాచ్ లో బాధ్యతాయుతంగా ఉండాల్సిన సీనియర్ ప్లేయర్.. దారుణంగా ఆడుతుండటంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకుండా.. అదే తప్పు మళ్లీ మళ్లీ చేస్తుండటంపై ఫైర్ అవుతున్నారు.
ఇలాంటి సమయంలో కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాలని.. లేదా తిరిగి ఫామ్ సాధించేందుకు కష్టపడాలని ఫ్యాన్స్ అంటున్నారు. గత రికార్డుల కారణంగానే కోహ్లీని టీమిండియా బ్యాకప్ చేస్తుందని మరికొందరు విమర్శిస్తున్నారు. ఇదే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ప్లేయర్ అయితే ఈపాటికి పక్కన పెట్టి ఉండేవారని చెపుతున్నారు. మరి విరాట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.